తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు సవాల్ విసిరారు కేపీసీసీ చీఫ్ , కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. మీరు కర్ణాటకకు వస్తే.. మేం 5 గ్యారెంటీలను అమలు చేస్తున్నామో లేదో చూపిస్తాం.. డేట్, టైం మీరే చెబితే బస్సులో తీసుకెళ్లి చూపిస్తామని శివకుమార్ సవాల్ విసిరారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు సవాల్ విసిరారు కేపీసీసీ చీఫ్ , కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారం తాండూరులో జరిగిన బస్సు యాత్రలో ఆయన పాల్గొన్నారు. మీరు కర్ణాటకకు వస్తే.. మేం 5 గ్యారెంటీలను అమలు చేస్తున్నామో లేదో చూపిస్తాం.. డేట్, టైం మీరే చెబితే బస్సులో తీసుకెళ్లి చూపిస్తామని శివకుమార్ సవాల్ విసిరారు. డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ కు వెళ్లి రెస్ట్ తీసుకోవడమేనని శివకుమార్ చురకలంటించారు.
సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పటల ప్రజలు కృతజ్ఞత చూపాలని ఆయన కోరారు. కాంగ్రెస్ మాత్రమే పేదల గురించి ఆలోచిస్తుందని శివకుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏదైనా హామీ ఇచ్చిందంటే తప్పక నెరవేరుస్తుందని ఆయన తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఈ పదేళ్లలో నెరవేరాయా అని శివకుమార్ నిలదీశారు. తెలంగాణలోనూ కర్ణాటక మాదిరిగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ALso Read: కామారెడ్డిపై కాంగ్రెస్ సస్పెన్స్.. షబ్బీర్‌కు నో చాన్స్.. రేవంత్ కోసమేనా..?
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు ఓఆర్ఆర్, మెట్రో రైలు తెచ్చింది, మత సామరస్యాన్ని కాపాడింది కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ తెచ్చిన ప్రాజెక్ట్‌ల వల్లే హైదరాబాద్ ఖ్యాతి పెరిగిందని.. లంచాలు ఇవ్వని రియల్ ఎస్టేట్ వ్యాపారులను అణిచివేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న కేసీఆర్ ప్రభుత్వం వారిని మోసం చేసిందని.. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.