Kalvakuntla Kavitha: ''తెలంగాణకు వచ్చే ముందు వాస్తవాలు తెలుసుకొని రావాలి. కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చని సిద్దరామయ్య.. ఏమొహం పెట్టుకొని తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తున్నారు..?'' అంటూ బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు కాకరేపుతున్నాయి. కాంగ్రెస్-బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. బీఆర్ఎస్, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే, సిద్ధరామాయ్య తీరుపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని పేర్కొన్న కవిత.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును విమర్శించే హక్కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేదని అన్నారు.
కేసీఆర్ పై సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందిస్తూ, కాంగ్రెస్ హామీలు, పథకాలకు భిన్నంగా, తెలంగాణలోని వెనుకబడిన వర్గాలే కాకుండా సమాజంలోని ప్రతి వర్గ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. కేసీఆర్ పై సిద్దరామయ్య నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నామని పేర్కొన్న కవిత.. తెలంగాణకు వచ్చే ముందు ఆయన వాస్తవాలు తెలుసుకొని రావాలని హితవుపలికారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చని సిద్దరామయ్య .. ఏమొహం పెట్టుకొని తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి మోసపోయేందుకు బీసీలు సిద్ధంగా లేరనీ, బీసీల పట్ల కాంగ్రెస్ ది ముమ్మాటికీ కపట ప్రేమేనని ఆరోపించారు.
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ.. బీసీలు టికెట్ ఆశించిన స్థానాల్లో ఇతరులకు టికెట్లను అమ్ముకున్న చరిత్ర రేటెంత రెడ్డిదని ఫైర్ అయ్యారు. బీసీ నేత ఆత్మహత్యయత్నం చేస్తే పరామర్శించే సోయి రేటెంత రెడ్డికి లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీ డిక్లరేషన్‌పై ఆమె మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే, 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు బీసీల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం రూ.45 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో పడేయాలని ప్రజలను అభ్యర్థించారు. బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రం వచ్చి చాలా ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు జనాభా లెక్కలు చేపట్టలేదని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని 2004లో డిమాండ్ చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తుచేశారు.