కరీంనగర్ ఆర్టీసీ పందెం కోడి కథకు ఎండ్ కార్డు.. ట్విస్ట్ ఇచ్చిన డిపో మేనేజర్.. ఏం చేశారంటే?

By Mahesh K  |  First Published Jan 12, 2024, 6:08 PM IST

కరీంనగర్ ఆర్టీసీ డిపోలో రెండు మూడు రోజులు గడిపిన పందెం కోడి కథకు ది ఎండ్ కార్డు పడింది. ఆ పందెం కోడిని ముందుగా ప్రకటించినట్టుగా వేలం వేయలేదు. దాని వల్ల చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉన్నదని భావించి బ్లూ క్రాస్ సొసైటీకి కోడిని అందించారు.
 


కరీంనగర్ ఆర్టీసీ డిపోలో రెండు మూడు రోజులు గడిపి పందెం కోడి కథకు ది ఎండ్ కార్డు పడింది. ఈ పందెం కోడి కోసం ఎవరూ రాకపోవడంతో రెండు మూడు రోజులు ఎదురుచూసిన ఆర్టీసీ అధికారులు దాన్ని వేలం వేస్తామని ప్రకటించారు. దీంతో మహేశ్ అనే ఓ వ్యక్తి ఆ కోడి తనదేనని, వేలం వేయనివ్వొద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. చివరకు ఈ పందెం కోడి కథ కంచికి చేరింది. ఆ కోడి బ్లూ క్రాస్ సొసైటీకి చేరింది.

పందెం కోడిని వేలం వేస్తే చట్టపరమైన చిక్కులు వస్తాయని ఆర్టీసీ డీపో మేనేజర్ తన నిర్ణయానికి ట్విస్ట్ ఇచ్చారు. ఆ పందెం కోడిని వేలం వేయలేదు. దానికి బదులు పందెం కోడిని బ్లూ క్రాస్ సొసైటీకి అప్పగించారు. దీంతో పందెం కోడి కథ సుఖాంతం అయింది.

Latest Videos

ఆ పందెం కోడి తనదేనని మహేశ్ అనే వ్యక్తి చెప్పినా.. విజ్ఞప్తి చేసినా ఆర్టీసీ అధికారులు విశ్వసించలేదు. అదీగాక, పందెం కోళ్ల ఆటపై ఏపీలో నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ పందెం కోడిని బ్లూ క్రాస్ సొసైటీకి అప్పగించారు.

Also Read: TS News: పార్టీ ఓటమికి నేనే బాధ్యుడ్ని: కేటీఆర్.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై క్లారిటీ

ఈ నెల 9వ తేదీన వరంగల్ నుంచి వేములవాడ మధ్య నడిచే బస్సు రాత్రి పూట వేముల వాడ నుంచి చివరి ట్రిప్‌గా కరీంనగర్‌కు చేరుకుంది. బస్సును డిపోలో పెట్టబోతుండగా బస్సులో నుంచి కోడి కూత వినిపించింది. ప్రయాణికులెవరూ లేకున్నా కోడి కూత రావడంతో అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా.. అక్కడ ఓ పందెం కోడి ఉన్నట్టు గుర్తించారు. ఆ పందెం  కోడిని ఆర్టీసీ డిపో మేనేజర్‌కు అప్పగించి డ్రైవర్, కండక్టర్ వెళ్లిపోయారు.

ఆయన రెండు రోజులు ఆ కోడిని డిపోలోనే ఉంచారు. ఎవరైనా వచ్చి తమ కోడిని అడుగుతారేమోనని ఎదురుచూశారు. కానీ, ఎవరూ రాకపోవడంతో ఆ కోడిని వేలం వేస్తామని ప్రకటించారు. ఈ వార్త దావానలంలా వ్యాపించింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వార్త చూసిన తర్వాత ఏపీకి చెందిన మహేశ్ రియాక్ట్ అయ్యాడు. ఆ కోడి తనదే అని చెప్పాడు. 

Also Read: Assembly Elections: ఈ నెల 25 నుంచి సీఎం జగన్ ఎన్నికల క్యాంపెయిన్! ఉత్తరాంధ్ర నుంచి జిల్లాల పర్యటన

తనవైపు స్టోరీని కూడా చెప్పుకొచ్చాడు. తన సొంతూరు కావలి.. నెల్లూరు జిల్లా అని పరిచయం చేసుకన్నాడు. తన పేరు మహేశ్ అని, ఏపీకి చెందిన నివాసిగా పేర్కొన్నాడు. తాను సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో మేస్త్రీ పని చేయిస్తుంటానని వివరించాడు. సోమవారం రోజున ఆంధ్రాకు వద్దామని బయల్దేరానని, నిద్ర మత్తులో కోడిని బస్సులోనే మరిచిపోయానని చెప్పాడు. ఆ తర్వాత బస్సు కోసం వెతికినా తనకు దొరకలేదని పేర్కొన్నాడు. ఇప్పుడు వీడియోలు, వార్తలు వస్తున్నాయని పేర్కొంటూ ఆ కోడి తనదేనని వివరించాడు. ఆ కోడి ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని, అది తన కోడేనని, ఎవరికి ఇవ్వవొద్దని, వేలం పాటను ఆపేయాలని కోరాడు. కోడి ఆధారాలు అన్నీ తన వద్ద ఉన్నాయని, బస్సు టికెట్ కూడా తన వద్ద ఉన్నదని తెలిపాడు. ఆ తర్వాత సజ్జనార్ సార్ అంటూ తన విజ్ఞప్తి చేశాడు.

click me!