అపహరణకు గురైన బాలుడిని ముంబయి పోలీసులకు అప్పగించిన కరీంనగర్ పోలీసులు

By telugu teamFirst Published Sep 3, 2021, 6:11 PM IST
Highlights

ముంబయిలో కిడ్నాప్‌కు గురైన తొమ్మిదేళ్ల బాలుడిని కరీంనగర్ పోలీసులు గంటల వ్యవధిలోనే కనుక్కున్నారు. తాజాగా ఆ బాలుడిని ముంబయిలోని బాంద్రా పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీసుల సత్వర స్పందనపై రాష్ట్ర డీజీపీ యం మహేందర్ రెడ్డి సహా ముంబయి పోలీసులు ప్రశంసలు కురిపించారు.
 

కరీంనగర్: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కిడ్నాప్‌కు గురైన తొమ్మిది నెలల బాలుడి కేసును గంటల వ్యవధిలోనే ఛేదించి కరీంనగర్ పోలీసులు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నారు. రాష్ట్ర డీజీపీ మహేందర్ సహా ముంబయి పోలీసుల నుంచి ప్రశంసలు పొందారు. తాజాగా, కిడ్నాప్‌కు గురైన బాలుడిని బాంద్రా పోలీసులకు అప్పగించారు. అదనపు డీసీపీ(పరిపాలన) జీ చంద్రమోహన్ సమక్షంలో బాంద్రా పోలీసులకు చిన్నారిని అప్పగించారు.

తొమ్మిది నెలల బాలుడు అపహరణకు గురైనట్టు తల్లిదండ్రులు ఆగస్టు 31న ముంబయిలోని బాంద్రా పోలీసుల స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసుల దర్యాప్తులో చిన్నారిని కరీంనగర్‌కు చెందిన వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టు కనుగొన్నారు. ఈ విషయాన్ని జిల్లా పోలీసులకు చేరవేశారు. బాంద్రా పోలీసులు కరీంనగర్ పోలీసు కమిషనర్ వీ సత్యనారాయణకు తెలిపారు. సమాచారం అందగానే చాలెంజ్‌గా తీసుకుని కేసును ఛేదించాల్సిందిగా ఆయన టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆదేశించారు.

టాస్క్ ఫోర్స్ పోలీసులూ వెంటనే రంగంలోకి దిగి టెక్నాలజీ సహాయంతో కిడ్నాప్‌కు గురైన బాలుడిని గుర్తించారు. ముంబయి నుంచి జిల్లాకు ఆ బాలుడిని తెచ్చిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

గంటల వ్యవధిలోనే కరీంనగర్ పోలీసులు కేసును ఛేదించి బాలుడిని బాంద్రా పోలీసులకు అప్పగించారు. ఈ కేసు ఛేదనతో కరీంనగర్ పోలీసులు తమ సమర్థతను చాటిచెప్పినట్టయింది. రాష్ట్ర డీజీపీ యం మహేందర్ రెడ్డిద సహా ముంబయి పోలీసులు కరీంనగర్ పోలీసులను ప్రశంసల్లో ముంచెత్తారు. సత్వరమే స్పందించిన కమిషనర్ వీ సత్యనారాయణను, స్వల్ప సమయంలోనే కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్ పోలీసులను డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు. 

click me!