మాధవీలతకు బీజేపీ టికెట్ ఇవ్వడంపై కరాటే కళ్యాణీ రియాక్షన్ ఇదే

By Mahesh K  |  First Published Mar 8, 2024, 5:04 PM IST

డాక్టర్ కొంపెల్లి మాధవీలతకు హైదరాబాద్ స్థానం నుంచి పోటీ చేయడానికి బీజేపీ టికెట్ ఇవ్వడంపై కరాటే కళ్యాణీ స్పందించారు. మహిళకు టికెట్ ఇవ్వడం సంతోషకరం అని, కానీ, మాధవీలత టికెట్ కోసమే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్టు తెలిసిందని కామెంట్ చేశారు.
 


ఈ సారి హైదరాబాద్ లోక్ సభ స్థానంలో నామమాత్రంగా పోటీ చేయబోదని, కచ్చితంగా గెలిచేలా పోటీ ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పలుమార్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై ఎవరు పోటీ చేస్తారా? అనే ఆసక్తి ఉండింది. అయితే.. బీజేపీ ఆ టికెట్‌ను మాధవీలతకు ఇవ్వడంతో పలువురు పార్టీ నాయకులు ఖంగుతిన్నారు. బలమైన, సీనియర్ నాయకుడిని హైదరాబాద్ బరిలో బీజేపీ దించుతుందని తాము భావించామని కొందరు అభిప్రాయపడ్డారు కూడా. తాజాగా హైదరాబాద్ స్థానం నుంచి పోటీకి బీజేపీ డాక్టర్ కొంపెల్లి మాధవీలతకు టికెట్ ఇవ్వడంపై సినీ నటి కరాటే కళ్యాణి రియాక్ట్ అయ్యారు.

హైదరాబాద్ ఎంపీ టికెట్ బీజేపీ మాధవీలతకు ఇవ్వడంపై తనకు అభ్యంతరం ఏమీ లేదని కరాటే కళ్యాణీ స్పష్టం చేశారు. కానీ, టికెట్ కేటాయింపుపై రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కష్టపడిన వారికి కాకుండా షో చేస్తున్న వారికి టికెట్లు ఇస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు, బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో లుకలుకలు ఉన్నాయని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని అధిష్టానం వరకు వెళ్లకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.

Latest Videos

Also Read: బేగంపేట్ ఎయిర్‌పోర్టులో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ? బీజేపీకి తెలుసా?

తాను తెలంగాణ నుంచి బీజేపీ టికెట్ పై పోటీ చేయాలని భావించడం లేదని కరాటే కళ్యాణీ స్పష్టం చేశారు. అయితే.. ఏపీలో బీజేపీ టికెట్ పై పోటీ చేయాలని ఆశపడుతున్నట్టు వివరించారు. కాగా, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిపై ఆరోపణలు చేశారు. ఓ మహిళకు టికెట్ ఇవ్వడం సంతోషకరమే అని పేర్కొన్న ఆమె.. కానీ, టికెట్ కోసమే మాధవీలత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నట్టు తెలిసిందని అన్నారు.

click me!