కేసీఆర్ ఇలాకాలో టీఆర్ఎస్ కు షాక్... రాజీనామా చేసిన టీఆర్ఎస్ సీనియర్ నేత

By Arun Kumar PFirst Published Jul 31, 2022, 8:46 AM IST
Highlights

టీఆర్ఎస్ నుండి భారీగా వలసలు వుంటాయన్న బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్న సమయంలో ముఖ్యమంత్రి సొంత జిల్లా, సొంత నియోజకవర్గ మాజీ ఇంచార్జి టీఆర్ఎస్ కు షాకిచ్చాడు.  

హన్మకొండ : టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందంటూ ప్రతిపక్షాల ప్రచారం ఓవైపు , మెళ్లిగా ప్రారంభమైన వలసలు మరోవైపు ఆ పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నాయి. గతంలో టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు కొనసాగగా ఇప్పుడు ఆ పార్టీలోంచి ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీల్లోకి వలసలు ప్రారంభమయ్యాయి. భవిష్యత్ లో టీఆర్ఎస్ నుండి భారీగా వలసలు వుంటాయన్న బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్న సమయంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ మాజీ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్ పార్టీకి రాజీనామా చేసారు. ఏ పార్టీలో చేరేదీ ఇంకా నిర్ణయించలేదని... త్వరలోనే భవిష్యత్ రాజకీయాలపై ప్రకటన చేస్తానని రాజయ్య యాదవ్ తెలిపారు. 

రాజీనామా ప్రకటన అనంతరం రాజయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంనుండి టీఆర్ఎస్ లో పనిచేస్తున్నానని తెలిపారు. ఇలా దాదాపు 22ఏళ్ల పాటు పార్టీకి సేవలందించినా తగిన గుర్తింపు లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేసారు. పదవులు, ప్రాణం లేకున్నా ఆత్మగౌరవమే ముఖ్యమని భావించి టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు రాజయ్య యాదవ్ తెలిపారు. ఇంతకాలం పార్టీలో తాను అనుభవించిన బాధ నుండి విముక్తి పొందుతున్నానని తెలిపారు.  

Read more  Etela: 'త్వరలో ఊహకు అందని రీతిలో బీజేపీలో చేరికలు.. నెక్స్ట్ టార్గెట్ కేసీఆరే..': ఈటెల సెన్సెషనల్ కామెంట్స్

తెలంగాణ ఉద్యమ సమయం నుండి కేసీఆర్ వెన్నంటే వున్నానని... స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక పలు పదవులు ఇస్తానని ముఖ్యమంత్రి  మాటిచ్చాడని రాజయ్య తెలిపారు.  ఓసారి ఎమ్మెల్సీ, మరోసారి రాజ్యసభ ఇస్తానని కేసీఆర్ చెప్పాడని... ఎందుకు ఇవ్వలేదో మాత్రం తెలియదన్నారు. తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా, మెదక్ జిల్లా ఇంచార్జీ, సీఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ఇంచార్జీగా పనిచేసానని... ఇలా పార్టీకి అందించిన సేవలను గుర్తించలేకపోవడంతో మనస్థాపంతో రాజీనామా చేస్తున్నట్లు రాజయ్య యాదవ్ తెలిపారు. 

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత లభించడంలేదని... ఆత్మగౌరవంతోనే ఆ పార్టీలోంచి బయటకు వస్తున్నామన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులెవ్వరూ లేరని... ఇప్పటికే ఆ పార్టీని వీడారని తెలిపారు. పార్టీ కోసం కష్టపడే వారికి టీఆర్ఎస్ లో భాదే మిగులుతుందని... అక్కడే వుంటే భవిష్యత్ లేదని సహచరులకు చెప్తున్నానని రాజయ్య యాదవ్ అన్నారు. 

ఇంకా టీఆర్ఎస్ పార్టీలోనే వుంటూ తలదించుకొని బతుకడం అనవసరమని భావిస్తున్నానని... .కాళ్ళు మొక్కి బతుకడం నచ్చడం లేదని రాజయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన ఇంటి నుండే ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్సీ, ఎంపీ వున్నారన్నారని...వారికేమి భాద లేదన్నారు. బాధంతా పార్టీ కోసం కష్టపడినవారికే అని అన్నారు. కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఉద్యమ కారులంతా ఒక తాటిపైకి రావాలని రాజయ్య యాదవ్ పిలుపునిచ్చారు. 
 

click me!