తెరపైకి మరోసారి కామారెడ్డి మాస్టర్ ప్లాన్: నామినేషన్లు దాఖలుపై నేడు కీలక భేటీ

By narsimha lodeFirst Published Oct 24, 2023, 11:03 AM IST
Highlights

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పరిధిలోకి వచ్చే ఎనిమిది గ్రామాల రైతులు ఇవాళ సమావేశం కానున్నారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుండి  నామినేషన్లు  దాఖలు చేసే విషయమై  చర్చించనున్నారు.

కామారెడ్డి: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.  మాస్టర్ ప్లాన్ బాధిత గ్రామాల ప్రజలు మంగళవారంనాడు  సమావేశం కానున్నారు.  ఎనిమిది గ్రామాలకు  చెందిన  రైతులు  ఈ సమావేశంలో పాల్గొంటారు.  భవిష్యత్తు కార్యాచరణపై  నిర్ణయం తీసుకుంటారు.  కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా   సీఎం కేసీఆర్ ఈ దఫా బరిలోకి దిగనున్నారు. దీంతో  ఈ ఎనిమిది గ్రామాల ప్రజలు కూడ  ఇండిపెండెంట్లుగా  రంగంలోకి దిగాలని భావిస్తున్నారు.ఈ విషయమై  ఇవాళ జరిగే సమావేశంలో చర్చించనున్నారు.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను  రద్దు చేస్తూ  ఈ ఏడాది జనవరి  19వ తేదీన  మున్సిపల్ కౌన్సిల్ సమావేశం  తీర్మానం చేసింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని కోరుతూ  బాధిత రైతులు  తెలంగాణ హైకోర్టును కూడ ఆశ్రయించారు.

2022 నవంబర్ మాసంలో  కామారెడ్డి  డ్రాఫ్ట్  మాస్టర్ ప్లాన్ ను ప్రకటించారు.ఇండస్ట్రీయల్ జోన్, గ్రీన్ జోన్, రీక్రియేషన్ జోన్, 100, 80 ఫీట్ల రోడ్లకు సంబంధించి  ప్రతిపాదనలు చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై  స్థానికులు ఆందోళనకు దిగారు. 

లింగాపూర్, టెకిర్యాల్, అడ్లూర్,  రామేశ్వర్ పల్లి, ఇల్చిపూర్, పాత రాజంపేట,సదాశివనగర్ లను  కామారెడ్డి మున్సిపాలిటీలో  విలీనం చేశారు.  కామారెడ్డి మాస్టర్ ప్లాన్  విషయమై  స్థానికులు ఈ ఏడాది ఆరంభంలో  పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.  

మాస్టర్ ప్లాన్ విషయమై  స్థానిక ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడంలో అధికారులు  విఫలమయ్యారని  మున్సిపల్ అధికారుల సమావేశంలో  మంత్రి కేటీఆర్  అప్పట్లో  వ్యాఖ్యలు చేశారు.   ప్రజలకు ఇబ్బంది కలిగే నిర్ణయాలు తీసుకోబోమని  మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్  ను నిరసిస్తూ  రైతులు  చేసిన ఆందోలనకు విపక్ష పార్టీల నేతలు మద్దతును ప్రకటించారు.మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ గతంలో  రైతులు ఆందోళనలు నిర్వహించిన సమయంలో  కాంగ్రెస్, బీజేపీ నేతలు  మద్దతు ప్రకటించారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ  రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. 

కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఈ దఫా  బీఆర్ఎస్ అభ్యర్ధిగా  కేసీఆర్ బరిలోకి దిగుతున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పరిధిలోకి వచ్చే గ్రామాల రైతులు ఇవాళ సమావేశం కానున్నారు.ఈ సమావేశంలో  భవిష్యత్తు కార్యాచరణపై  కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.  

also read:జగిత్యాల, కామారెడ్డి మాస్టర్ ప్లాన్లు రద్దు: తీర్మానం చేసిన మున్సిపల్ పాలకవర్గాలు

2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో  పసుపు రైతులు  నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో  నామినేషన్లు దాఖలు చేసే విషయమై కామారెడ్డి మాస్టర్ ప్లాన్ గ్రామాల పరిధిలోని రైతులు యోచిస్తున్నారు. 1996 లో  నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో  486 మంది  నామినేషన్లు దాఖలు చేశారు. దేశ వ్యాప్తంగా  ఈ అంశం అప్పట్లో  చర్చకు దారితీసింది.
 

click me!