శంకర్ ‘‘ ఒకేఒక్కడు ’’ స్పూర్తిగా .. ఫిర్యాదుల పెట్టెలు , కామారెడ్డి ఎమ్మెల్యే వినూత్న ఆలోచన

By Siva Kodati  |  First Published Feb 11, 2024, 7:04 PM IST

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఓ కార్యక్రమాన్ని చేపట్టారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి. నియోజకవర్గం మొత్తం ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేశారు. ఫిర్యాదులను తానే స్వయంగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు. 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో రాజకీయ దిగ్గజాలైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిలను ఓడించి జెయింట్ కిల్లర్ అనిపించుకున్నారు బీఆర్ఎస్ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి. దీంతో అప్పట్లో కామారెడ్డి నియోజకవర్గం , రమణారెడ్డి పేర్లు దేశవ్యాప్తంగా మారుమోగిపోయాయి. మాజీ సీఎం, ప్రస్తుత సీఎంలను ఓడించిన వ్యక్తి ఎవరా అని నెటిజన్లు ఆన్‌లైన్‌లో తెగ సెర్చ్ చేశారు. ఎన్నికలకు ముందు నుంచే సేవా కార్యక్రమాలతో తన ముద్ర వేసిన కాటిపల్లి.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. 

ఇటీవల రోడ్డు విస్తరణ పనుల నిమిత్తం తన  సొంతింటిని సైతం కూల్చివేయించి ఆదర్శంగా నిలిచారు. దాదాపు 1000 గజాలకు పైనే వుండే స్థలాన్ని ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించారు. దీని విలువ రూ.6 కోట్లు పై మాటే. ఈ ఇంటిని రమణారెడ్డి పూర్వీకులు నిర్మించారు. ఇది ఆయనకు ఎంతో ప్రత్యేకం. అయినప్పటికీ ప్రజలు, పట్టణాభివృద్ధి కోసం ఎమ్మెల్యే తన ఇంటిని కూల్చివేసేందుకు అనుమతించారు. రహదారుల విస్తరణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని రమణారెడ్డి పిలుపునిచ్చారు.

Latest Videos

తాజాగా మరో వినూత్న కార్యక్రమంతో ముందుకు వచ్చారు కాటిపల్లి వెంకట రమణారెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం ఆయన ఓ సినిమాను ప్రేరణగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమాలో .. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేస్తారు.

ఇప్పుడు దానిని స్పూర్తిగా తీసుకుని కాటిపల్లి కూడా నియోజకవర్గం మొత్తం ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కమాన్ వద్ద ఆదివారం ఆయన ఫిర్యాదుల బాక్స్‌ను ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నానని.. ఫిర్యాదులను తానే స్వయంగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు. 

click me!