మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ కామారెడ్డిలో ఇవాళ బంద్ కొనసాగుతుంది. రైతు జేఏసీ కామారెడ్డి బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు కాంగ్రెస్, బీజేపీలు మద్దతును ప్రకటించాయి.
కామారెడ్డి: కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ శుక్రవారం నాడు కామారెడ్డి బంద్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఈ బంద్ కు మద్దతును ప్రకటించాయి.కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ నెల రోజులకు పైగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోలేదు. మాస్టర్ ప్లాన్ తో తమ పంట పొలాలను కోల్పోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే ఆవేదనతో అడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మాస్టర్ ప్లాన్ పరిధిలోని ఐదు గ్రామాల రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయమై కామారెడ్డి కలెక్టరేట్ ముందు నిన్న ఆందోళన నిర్వహించారు. నిన్న కలెక్టరేట్ ముందు నిర్వహించిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. నిన్న రాత్రి ఎనిమిదిగంటల సమయంలో రైతులు తమ ఆందోళనను విరమించారు.
undefined
అడ్లూరు ఎల్లారెడ్డి కి చెందిన రాములు ఆత్మహత్యకు మాస్టర్ ప్లాన్ కు సంబంధం లేదని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మాస్టర్ ప్లాన్ పై అనుమానాలుంటే తాము వాటిని నివృత్తి చేస్తామని కలెక్టర్ ప్రకటించారు..కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను వెంటనే వెనక్కి తీసుకొంటామని ప్రకటిస్తేనే తాము ఆందోళనను విరమిస్తామని రైతులు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇవాళ కామారెడ్డి బంద్ కు రైతు జేఏసీ పిలుపునిచ్చింది. ఈ బంద్ కు రాజకీయ పార్టీలు మద్దతును ప్రకటించాయి. కామారెడ్డి బంద్ నేపథ్యంలో రైతు సంఘాల నేతలు , బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
కామారెడ్డిలో భారీగా పోలీసులను మోహరించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదా మాత్రమేనని ప్రభుత్వం చెబుతుంది. మున్సిఫల్ శాఖ సమావేశంలో ఈ విషయమై కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ ను మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.మాస్టర్ ప్లాన్ పై స్థానిక ప్రజల సందేహాలను తీర్చకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పనులనే ప్రభుత్వం చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. బంద్ ను పురస్కరించుకొని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ కామారెడ్డికి వెళ్లనున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా ఇవాళ కామారెడ్డికి రానున్నారు.. కామారెడ్డికి వెళ్లే రూట్లను పోలీసులు బ్లాక్ చేశారు. ఇతర ప్రాంతాల నుండి పట్టణంలోకి ఎవరిని రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని పోలీసులు తెలిపారు.