అకున్ సబర్వాల్ పై కడియం సీరియస్

First Published Jul 6, 2017, 5:56 PM IST
Highlights

ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన కడియం శ్రీహరికి ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మీద పట్టరాని కోపమొచ్చింది. అకున్ సబర్వాల్ ఇన్వెస్టిగేషన్ పేరుతో చేస్తున్న హడావిడి కడియం కు నచ్చలేదు. దీంతో ఆయన తీరు సరిగా లేదంటూ మీడియా ముందు పేర్కొన్నారు.

ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులు జాగ్రత్తగా ఉండాలి కానీ వివరాలు బయటకు రావడం పట్ల కడియం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే హైదరాబాద్ లోని 19 పాఠశాలలు, మరో 14 కళాశాలలు డ్రగ్ మాఫియా గుప్పిట్లో ఉన్నాయని పోలీసు వర్గాల నుంచి లీకులు వచ్చాయి. ఆయా స్కూళ్లు, కాలేజీల పేర్లు కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయ్యాయి.

 

ఇలా స్కూల్స్, కాలేజెస్ పేర్లు బయటకు వస్తే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యే ప్రమాదముందని కడియం ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఆయా విద్యా సంస్థల పేర్లు ఎందుకు బయటకు వచ్చాయో అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విచారణ చేసే అధికారులు సమాచారం సేకరించి సర్కారుకు నివేదిక ఇవ్వాలి తప్ప బహిర్గతపరచడం సరికాదన్నారు.

 

విచారణ అధికారిగా అకున్ సబర్వాల్ సమాచారాన్ని లీక్ చేయడం పట్ల కడియం ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. అందుకే ఆయన అకున్ సబర్వాల్ కు మీడియా సాక్షిగా చురకలంటించారు. ఇంత జరిగితే డ్రగ్స్ విషయంలో విద్యా సంస్థలకు నోటీసులు, వాటిపై విచారణ విషయాన్ని కూడా విద్యాశాఖకు సమాచారం ఇవ్వకుండానే ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ చేపట్టిందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఈ విషయంలోనూ అకున్ తీరు పట్ల కడియం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది.

click me!