
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో సంచలన కామెంట్స్ చేస్తుంటారు. తన మాటలతో ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తెలంగాణలో తర్వలో మునుగోడు ఉప ఎన్నిక రానున్న వేళ.. కేఏ పాల్ సంచలన ప్రకటన చేశారు. మునుగోడు నిరుద్యోగ యువతకు బంఫర్ ఆఫర్ ఇస్తున్నట్టుగా వీడియో రిలీజ్ చేశారు. తన 59వ జన్మదినం సందర్భంగా మనుగోడు నియోజకవర్గంలోని 59మంది నిరుద్యోగులను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి వారికి పాస్‌పోర్ట్, అమెరికా వీసా ఉచితంగా ఇప్పించనున్నట్లు తెలిపారు.
‘‘మునుగోడు నియోజకవర్గంలోని 50 వేల మంది నిరుద్యోగులకు మంచి సదావకాశం. మీరందరు రెజ్యూమ్‌లు తీసుకుని సెప్టెంబర్ 25 ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యన శ్రీవారి హోమ్స్ గ్రౌండ్స్‌కు రండి. నా 59వ పుట్టినరోజు కానుకగా వచ్చినవారిలో 59 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేసి.. వారికి పాస్ పోర్టు చేయించి, అమెరికా వీసా స్పాన్సర్ షిప్ చేయిస్తాను. అందరూ బాగుండాలి. 175 గ్రామాల నుంచి నిరుద్యోగులు వస్తే ఒక్కొక్క గ్రామం నుంచి ఒకరు చొప్పున తీసుకుంటాను.
బీసీ కుటుంబంలో పుట్టి దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్న నాకు.. నిరుద్యోగుల కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ముఖ్యమంత్రి, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధాని మోదీ ఏమైనా చేశారా?. అందుకే ఈ ఉప ఎన్నికలో వారు చెప్పే మాటలు నమ్మకండి. మనల్ని మనం అభివృద్ది చేసుకుందాం. మీ కుటుంబ సభ్యులతో కలిసి రండి. ఇందుకోసం నేను ఎలాంటి డబ్బులు తీసుకోవడం లేదు. మన నియోజకవర్గాన్ని, మన రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకుందాం’’ అని కేఏ పాల్ వీడియోలో పేర్కొన్నాడు.