బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు ఆ పార్టీని వీడనున్నారు. ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీలో కేశవరావు చేరనున్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు ఆ పార్టీని వీడనున్నారు. ఈ నెల 30వ తేదీన కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ నెల 28న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో కేశవరావు భేటీ అయ్యారు. పార్టీ మారాలని కేశవరావు కేసీఆర్ వద్ద ప్రస్తావించినట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ నిర్ణయంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టుగా బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.
కేసీఆర్‌తో భేటీ ముగిసిన తర్వాత హైద్రాబాద్ లో కేశవరావు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కేశవరావు చెప్పారు. తన చివరి దశలోకాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కేశవరావు చెప్పారు. ఇదిలా ఉంటే ఈ నెల 30వ తేదీన తనతో పాటు తన తండ్రి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టుగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈ నెల 28న ప్రకటించారు. మరో వైపు కేశవరావు తనయుడు విప్లవ్ కుమార్ మాత్రం బీఆర్ఎస్ లోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కేశవరావుతో భేటీ అయ్యారు. దీపాదాస్ మున్షి కేశవరావుతో భేటీ జరిగిన రోజునే కేశవరావు పార్టీ మారుతారనే ప్రచారం ప్రారంభమైంది. ఈ ప్రచారానికి తెరపడింది. కేశవరావు, ఆయన కూతురు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు..గత ఏడాది నవంబర్ మాసంలో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. దీంతో బీఆర్ఎస్ ను కీలక నేతలు వీడుతున్నారు. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ నాయకత్వం కేంద్రీకరించింది. క్షేత్ర స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసే విషయమై కేంద్రీకరించింది.