Jubilee Hills Gang Rape Case: పోలీసుల విచారణలో కీలక పరిణామం.. నిందితుల డీఎన్‌ఏ సేకరణకు అనుమతించిన కోర్టు..

By Sumanth KanukulaFirst Published Jun 27, 2022, 11:33 AM IST
Highlights

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అమ్నిషియా పబ్ వద్ద నుంచి బాలికను తీసుకెళ్లి కారులో అత్యాచారం జరిపిన ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. నిందితుల నుంచి డీఎన్‌ఏ సేకరణకు పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఇందుకు కోర్టు అనుమతివ్వడంతో డీఎన్‌ఏ నమునాలు సేకరించి.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు.


హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అమ్నిషియా పబ్ వద్ద నుంచి బాలికను తీసుకెళ్లి కారులో అత్యాచారం జరిపిన ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. తాజాగా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యాధునిక ఫోరెన్సిక్‌ టెక్నిక్‌, డీఎన్‌ఏ నమూనాలపై పోలీసులు దృష్టి సారించారు. నిందితుల నుంచి డీఎన్‌ఏ సేకరణకు పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఇందుకు కోర్టు అనుమతివ్వడంతో ఈ కేసులో నలుగురు మైనర్లు, ఒక మేజర్ నుంచి డీఎన్‌ఏ నమూనాలను త్వరలో సేకరించనున్నారు. 

ఇప్పటికే.. ఫోరెన్సిక్ నిపుణులు బాలికపై అత్యాచారం జరిగిన ఇన్నోవా కారులో ఆధారాలు సేకరించిన సంగతి తెలిసిందే. డీఎన్​ఏ సేకరించిన తర్వాత వాహనంలోని ఆధారాలతో పోల్చనున్నారు.నిందితులు ఇన్నోవా వాహనంలోనే ఉన్నట్లు శాస్త్రీయంగా నిరూపించడానికి డీఎన్​ఏ టెస్ట్ ఉపయోగపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. 

ఇక, ఈ కేసుకు సంబంధించి అత్యాచార బాధితురాలు.. ఇప్పటికే పోలీసుల ముందు, కోర్టు ముందు తన వాంగ్మూలాన్ని ఇచ్చింది. నేరం జరిగిన క్రమాన్ని వివరించింది. ఒకవేళ అవసరమైతే పోలీసులు బాధితురాలు డీఎన్‌ఏ శాంపిల్‌ను కూడా సేకరించే అవకాశం ఉంది. 

మరోవైపు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆరుగురు నిందితుల పాస్‌పోర్టులను జప్తు చేసేందుకు స్థానిక కోర్టును ఆశ్రయించారు. నిందితులకు ఒకవేళ బెయిల్ వస్తే దేశం వదిలి వెళ్లే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పాస్‌పోర్ట్‌ను జప్తు చేయమని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అథారిటీని కోర్టు ఆదేశించాల్సి ఉంటుంది. తాజాగా నిందితుల బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. 

ఇక, ఈ కేసులో ఆరుగురు నిందితులు ఉండగా.. అందులో ఐదుగురు మైనర్లు, ఒక మేజర్ ఉన్నారు. అయితే ఒక మైనర్ మాత్రం బాలికపై అత్యాచారానికి పాల్పడలేదని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం మేజర్ అయిన సాదుద్దీన్ చంచల్​గూడ జైల్లో ఉండగా.. ఐదుగురు మైనర్లు జువైనల్ హోంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

click me!