జర్నలిస్ట్ శంకర్ పై గురువారం రాత్రి భౌతిక దాడి జరిగింది (Journalist Shankar attacked by unidentified persons). పలువురు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి పదిన్నర తరువాత ఆయనపై దాడి చేశారు. ఈ దాడిని మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి ఖండించారు.
తెలంగాణ దినపత్రిక, న్యూస్ లైన్ వెబ్ సైట్ ఎడిటర్ శంకర్ పై దాడి జరిగింది. ఆయన ఆఫీసు ఎదుటే పలువురు వ్యక్తులు మూకుమ్మడిగా ఆయనపై దాడి చేశారు. గురువారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తన ఆఫీసు నుంచి బయటకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
జర్నలిస్ట్ శంకర పై జరిగిన దాడికి అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. అందులో పలువురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను తన్నడం, కొట్టడం కనిపిస్తోంది. అక్కడి నుంచి ఆయన ఎలాగో తప్పించుకొని స్థానికంగా ఉన్న ఇళ్లలోకి వెళ్లి రక్షణ పొందారు. అనంతరం ఆయనను స్థానికులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
నిన్న రాత్రి జర్నలిస్ట్ శంకర్ మీద తన ఆఫీస్ ముందే 15 మందికి కలిసి మూకుమ్మడి దాడికి పాల్పడ్డ గుండాలు. https://t.co/bueNmiBWL5 pic.twitter.com/nc6EKruw0M
— Telugu Scribe (@TeluguScribe)
కాగా.. ఈ ఘటనపై మాజీ మంత్రులు, పలువురు బీఆర్ఎస్ స్పందించారు. ఈ దాడిని ఖండించారు. ‘‘జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై జరిగిన దాడి మరువక ముందే మరో జర్నలిస్ట్ శంకర్ పై గుర్తుతెలియని గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్నారనే ముద్ర వేసి, భౌతిక దాడులకు పాల్పడటం హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించడం అంటే ప్రజల గొంతు నొక్కడమే.’’ అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
‘‘ ఒకవైపు ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ, మరోవైపు ప్రశ్నించే జర్నలిస్ట్ పై దాడి, బెదిరించడం నీచమైన చర్య. ప్రభుత్వం స్పందించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి పునరవృతం కాకుండా చూడాలి.’’ అని ఆయన ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ‘‘నిజాలు నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువస్తున్న జర్నలిస్ట్ శంకర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాపాలన అని చెప్పుకుంటూ పాశవిక దాడులు చేయడం ఎంతవరకు సమంజసం? జర్నలిస్ట్ శంకర్ పై హత్యాయత్నం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. దాడులు, కేసులతో ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూడడం రేవంత్ సర్కార్ నియంత పోకడలకు నిదర్శనం. జర్నలిస్ట్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
జర్నలిస్ట్ శంకర్ పై గుర్తుతెలియని గూండాల దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు
సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో శంకర్ ను పరామర్శించిన జగదీష్ రెడ్డి గారు
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు చోటు లేదు..
ఈ దాడికి పాల్పడ్డ గూండాలను త్వరగా అరెస్ట్… pic.twitter.com/eG8ZNak0pd
కాగా.. సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ శంకర్ ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు చోటు లేదని, ఈ దాడికి పాల్పడ్డ గూండాలను త్వరగా అరెస్ట్ చేయాలని పోలీస్ వారిని కోరుతున్నామని జగదీష్ రెడ్డి ‘ఎక్స్’ హాండిల్ లో పోస్టు పెట్టారు.