నా భర్తది అక్రమ అరెస్ట్: హైకోర్టును ఆశ్రయించిన రఘు భార్య లక్ష్మీప్రవీణ

By Siva KodatiFirst Published Jun 4, 2021, 5:53 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ రఘు భార్య లక్ష్మీప్రవీణ‌ హైకోర్టును ఆశ్రయించారు. తన భ‌ర్త రఘును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆమె రిట్ పిటిష‌న్ దాఖలు చేశారు. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన న్యాయస్థానం.. ప్రతివాదుల‌కు నోటీసులిచ్చింది

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ రఘు భార్య లక్ష్మీప్రవీణ‌ హైకోర్టును ఆశ్రయించారు. తన భ‌ర్త రఘును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆమె రిట్ పిటిష‌న్ దాఖలు చేశారు. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన న్యాయస్థానం.. ప్రతివాదుల‌కు నోటీసులిచ్చింది. అరెస్ట్ అక్రమ‌మో.. కాదో తేలుస్తామ‌ని హైకోర్టు వెల్లడించింది. అలాగే బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాల‌ని న్యాయస్థానం సూచించింది. 

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రబోడు తండా దాడి ఘటనకు సంబంధించిన కేసులో జర్నలిస్ట్ రఘును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన రఘును మధ్యలో అడ్డుకుని జీపులో ఎక్కించారు. అయితే పోలీసులు రఘును అదుపులోకి తీసుకున్న తీరు.. అరెస్ట్‌కు ముందు కుటుంబసభ్యులకు ఎలాంటి సమాచారం అందించకపోవడంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. 

Also Read:పోలీసులపైనే దాడికి కారణమంటూ... ప్రముఖ యూట్యూబ్ యాంకర్ రఘు అరెస్ట్

కాగా, మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా 540 సర్వే నంబర్ ఘర్షణ కేసులో నిందితుడిగా ఉన్నాడు జర్నలిస్ట్ రఘు. అసలు ఈ గుర్రంపోడు వివాదం ఏంటంటే...  టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గిరిజనుల భూములను ఆక్రమించారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. 540 సర్వే నెంబర్‌లోని వివాదాస్పద భూములను పరిశీలించేందుకు బీజేపీ నేతలు అక్కడికి వెళ్లారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు.

టీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ రేకుల షెడ్డును ధ్వంసం చేయడంతో పాటు ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లదాడికి దిగాయి. వీరిని నిలువరించేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ఈ క్రమంలోని రాళ్లదాడిలో సీఐకి గాయాలయ్యాయి.

click me!