Mlc Elections:అభ్యర్ధుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు, మరికొన్ని గంటల్లో అభ్యర్ధుల ప్రకటన

By narsimha lodeFirst Published Nov 14, 2021, 2:44 PM IST
Highlights

ఎమ్మెల్సీ  పదవుల కోసం టీఆర్ఎస్ లో తీవ్రమైన పోటీ నెలకొంది. మరో వైపు  ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపిక కోసం టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇవాళ లేదా రేపు అభ్యర్ధులను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నారు.  పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారిని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భావిస్తున్నారు.నామినేషన్ల దాఖలుకు కూడా సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇవాళ లేదా రేపు టీఆర్ఎస్ నాయకత్వం అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోటాతో పాటు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.

ఎమ్మెల్సీ పదవుల కోసం టీఆర్ఎస్ లో పోటీ తీవ్రంగా ఉంది. గతంలో ఎమ్మెల్యే టికెట్లు దక్కని వారికి  ఇచ్చిన హామీలతో పాటు నామినేటేడ్ పదవులు దక్కని వారికి ఎమ్మెల్సీ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సామాజిక వర్గాల వారీగా ఎమ్మెల్సీ పదవుల్లో  ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.  తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారికి తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19 ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్ధుల ఎంపికకు గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో Bjp నుండి రాజకీయంగా పొంచి ముప్పును దృష్టిలో ఉంచుకొని టీఆర్ఎస్ నాయకత్వం అభ్యర్ధుల ఎంపికపై కేంద్రీకరించనుంది.ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మాజీ స్పీకర్ మధుసూధనా చారి, కడియం శ్రీహరి, పార్టీ జనరల్ సెక్రటరీ తక్కెళ్ళ పల్లి రవీందర్ రావు ల పేర్లు వినిపిస్తున్నాయి. మధుసూదనా చారికి ఉద్యమకారుల కోటాలో ఎక్కువ అవకాశాలున్నాయి. కడియం శ్రీహరికి అవకాశం ఇవ్వనున్నారనే ప్రచారం సాగుతుంది. పార్టీలో  మొదటి నుంచి  ఉన్న తక్కెళ్ళ పల్లి రవీందర్ రావు పేరు కూడా పరిశీలనలో ఉంది. 

also read:MLC elections: సమీపిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలు.. టీఆర్‌ఎస్ నేతలను వెంటాడుతున్న ఆ భయం..

నల్గొండ జిల్లా నుంచి శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లేదా కోటి రెడ్డికి అవకాశం ఉంది.గుత్తా సుఖేందర్ రెడ్డిని గవర్నర్ కోటాకు పంపితే ఆకోటాలో గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. సాగర్ ఉపఎన్నికప్పుడు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన కోటి రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. Congress  ను వీడి టీఆర్ఎస్ లో చేరిన సమయంలో కౌశిక్ రెడ్డిని గనర్నర్ కోటాలో Mlc గా రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. అయితే కౌశిక్ రెడ్డి ఫైలును గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. దీంతో కౌశిక్ రెడ్డికి మరో రూపంలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టే అవకాశం ఉందనే ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో నెలకొంది. ఇదిలా ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. 

Huzurabad bypoll  ముందు  Trs లో చేరిన ఎల్. రమణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి  పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కరీంనగర్ నుంచి చాలా మంది నేతలు ఎమ్మెల్సీ అవకాశం అడుగుతున్నా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన  ఎల్ . రమణ కు టీఆర్ఎస్ నాయకత్వం ప్రాధాన్యత ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఎల్. రమణ టీఆర్ఎస్ లో చేరే సమయంలో రమణకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేఃసీఆర్ హామీ ఇచ్చారు. గతంలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గుండు సుధారాణి ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేశారు. కాని ఆమెను వరంగల్ మేయర్ గా అవకాశం ఇచ్చారు. ఈ సామాజిక వర్గానికి చెందిన వారు మండలిలో ఒక్కరు కూడా లేకపోవటం ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతుంది.

మంత్రి హరీష్ రావు అనుచరుడు ఎస్సీ కార్పెరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. చాలా సార్లు ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు చేసిన ఎర్రోళ్ళ శ్రీనివాస్ పదవి దక్కలేదు. మెదక్ జిల్లాలోని అసెంబ్లీ స్థానం నుండి శ్రీనివాస్ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. ఎమ్మెల్సీ స్థానం కోసం  పోటీ పడుతున్న నేతలంతా తమ ఏర్పాట్లు తాము చేసుకొంటున్నారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను ప్రసన్నం చేసుకొనేందుకు గాను ఆశావాహులు తమ ప్రయత్నాలు చేసుకొంటున్నారు.
 

click me!