జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్లో కేటాయించిన 38 ఎకరాల భూమిని సుప్రీంకోర్టు ఆదేశించినా సొసైటీకి స్వాధీనం చేయకపోవడంతో సొసైటీ మరోసారి ఆందోళనకు సిద్ధమైంది.
జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్లో కేటాయించిన 38 ఎకరాల భూమిని సుప్రీంకోర్టు ఆదేశించినా సొసైటీకి స్వాధీనం చేయకపోవడంతో సొసైటీ మరోసారి ఆందోళనకు సిద్ధమైంది. సుప్రీం తీర్పును అమలు చేయడంలో అధికారులు , ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈ నెల 18వ తేదిన ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద “మహాధర్నా” నిర్వహిస్తున్నట్టు సొసైటీ సభ్యులు ప్రకటించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ధర్నా ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొని మద్దతు ఇవ్వాల్సిందిగా బిఆర్ఎస్ సహా అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, ఉద్యోగ, విద్యార్థి సంఘాలను ఆహ్వానిస్తున్నట్లు సొసైటీ సభ్యులు వివరించారు.
కాగా.. జేఎన్‌జే సొసైటీకి చెందిన భూవివాదం గురించి హైదరాబాద్‌లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీమ్ జేఎన్‌జే సారథ్యంలో ఆధ్వర్యంలో జూలై 3న ఓ సమావేశం జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యుల ఈ సమావేశంలో హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. నిజాంపేట్, పేట్ బషీరాబాద్‌లోని 70 ఎకరాలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జేఎన్‌జే సొసైటీకే చెందుతాయని అన్నారు. సుప్రీంకోర్టు తీ్పును పూర్తిస్థాయిలో అధ్యయనం చేసినట్లయితే ఆ స్థలాలను జేఎన్‌జే సొసైటీకి అప్పగించాల్సిందేనని తెలిపారు.
ALso Read: ఆ స్థలాలకు మీరు డబ్బులు చెల్లించారు.. మీరే యజమానులు: హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్
అప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధర ప్రకారమే రూ. 12.33 కోట్లు చెల్లించి సొసైటీ సభ్యులు ఈ భూమి కొనుగోలు చేశారని వివరించారు. వీటిని కొనుగోలు చేయడం, దానిపైనే సుప్రీం తుది తీర్పు అనే ఆయుధాలతో భూమిని స్వాధీనం చేసుకునే హక్కును కలిగించిందని చెప్పారు. ఒక వేళ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయని పక్షంలో మళ్లీ సుప్రీం తలుపు తట్టవచ్చని వివరించారు. ఈ స్థలాల్లో మూడో పార్టీ జోక్యం లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. ఈ సభ్యులు స్థలాలను డబ్బులు పెట్టి కొన్నందున సర్వ హక్కులు వారికే ఉంటాయని అన్నారు. ప్రభుత్వ వర్గాలు ఈ స్థలాన్ని ఇవ్వడానికి నిరాకరించిన పక్షంలో ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేయాలని, అందులో తాను కూడా పాల్గొంటానని చెప్పారు.
ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వ ఈ స్థలాలను సొసైటీ సభ్యులకు అందించకుంటే అన్ని రకాల సహకారాలను అందిస్తామని సుప్రీంకోర్టు అడ్వకేట్ రామచంద్ర రావు అన్నారు. సభ్యులు రూ. 2 లక్షల చొప్పున రూ. 12.33 కోట్లు ప్రభుత్వానికి చెల్లించినందున 70 ఎకరాల స్థలం జర్నలిస్టులకే చెందుతుందని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పు ప్రకారం పేట్ బషీరబాద్‌లోని 38 ఎకరాల స్థలాన్ని వెంటనే సొసైటీకి స్వాధీనం చేయాల్సిన అవసరం ఉన్నదని వివరించారు.