రేవంత్ రెడ్డికి షాక్: కొత్త పీసీసీ అధ్యక్షుడిగా జీవన్ రెడ్డి?

By telugu teamFirst Published Nov 15, 2020, 1:35 PM IST
Highlights

కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి ఆ అవకాశం దక్కే పరిస్థితి లేదు. కొత్త పీసీసీ అద్యక్షుడిగా జీవన్ రెడ్డికి అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ పీసీసీ ప్రక్షాళనకు కాంగ్రెసు అధిష్టానం నడుం బిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా తొలగించడానికే నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించడానికి కసరత్తు సాగుతున్నట్లు చెబుతున్నారు. 

దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా తొలగించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఆయనకు వ్యతిరేకంగా కొన్ని చోట్ల కాంగ్రెసు కార్యకర్తలు ఆందోళనకు కూడా దిగారు. దీంతో ఆయనకు స్థాన చలనం తప్పదని భావిస్తున్నారు. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పీసీసీ పదవి కోసం పట్టుబడుతున్నారు 

ఆయనతో పాటు టీడీపీ నుంచి కాంగ్రెసులోకి వచ్చినవారు  ఆ డిమాండ్ చేస్తున్నారు. అయితే, రేవంత్ రెడ్డికి కొంత మంది సీనియర్ కాంగ్రెసు నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ స్థితిలో ఆయనకు పీసీసీ పీఠం దక్కడం అంత సులభం కాదని అంటున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు పీసీసీ పీఠం అప్పగించినా అటువంటి వ్యతిరేకతే ఎదురవుతుందని అంటున్నారు.

Also Read: జిహెచ్ఎంసీ ఎన్నికలపై కసరత్తు: రేవంత్ రెడ్డికి బిజెపి పెద్దల గాలం

ఈ స్థితిలో కాంగ్రెసు అధిష్టానం తీవ్రమైన కసరత్తు చేయడంతో పాటు పార్టీ నాయకుల్లో చీలిక రాకుండా చూసుకోవాలనే అభిమతంతో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా, రెడ్డి సామాజిక వర్గం నుంచి పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం జరిగిపోయినట్లు కూడా చెబుతున్నారు.

జీవన్ రెడ్డిని కాంగ్రెసులోని నాయకులంతా అంగీకరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆయన అందరినీ కలుపుకుని పోతారని కూడా అనుకుంటున్నారు. ఒక వేళ జీవన్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే రేవంత్ రెడ్డి ఏం చేస్తారనే సందేహం మాత్రం వెంటాడుతూనే ఉంది. అధిష్టానం ఆలోచన తెలియడం వల్లనే గత కొంత కాలంగా రేవంత్ రెడ్డి అంతగా దూకుడు ప్రదర్శించడం లేదనే మాట వినిపిస్తోంది. చివరి నిమిషంలో ఆలోచన మార్చుకుంటే తప్ప జీవన్ రెడ్డి కొత్త పీసీసీ అధ్యక్షుడు కావడం ఖాయమని అంటున్నారు. 

click me!