
గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మళ్లీ జనశక్తి నక్సల్స్ కదలికలు ప్రారంభం అయ్యాయా..?, కొంతమంది మాజీలు ఇటీవల రహస్యంగా సమావేశమయ్యారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా అటవీ ప్రాంతంలో జనశక్తి నక్సల్స్ సమావేశం నిర్వహించారనే వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సిరిసిల్ల సరిహద్దుల్లోని పోతురెడ్డిపల్లి ఫారెస్ట్ లో 80 మంది జనశక్తి నక్సల్స్ సమావేశం అయ్యారు. జనశక్తి సెక్రెటరీ విశ్వనాధ్ నేతృత్యంలో సిరిసిల్లా సరిహద్దుల్లో 8మంది జనశక్తి సాయుధులు, 65 మంది సానుభూతిపరులు సమావేశంలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది.
ఇందులో సిరిసిల్ల , కొనరావేపేట్ , ఎల్లారెడ్డి పెట్ , గంభీరావ్ పేట్ , ముస్తాబాద్ కు చెందిన పలువురు మాజీలు కూడా ఉన్నట్టుగా సమాచారం. జనశక్తి నక్సల్స్ మీటింగ్ వార్తల నేపథ్యంలో పోలీసుల శాఖ అప్రమత్తమైంది. అసలు క్షేత్ర స్థాయిలో ఏం జరిగిందో తెలసుకునే పనిలో పడింది. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా వివరాలను ఆరా తీసే పనిలో పడినట్టుగా సమాచారం.
జనశక్తి పార్టీ మీటింగ్ విషయం బయటకు లీక్ కావడంతో స్థానిక పోలీసులు కూడా ప్రత్యేక నిఘా పెట్టారు. అసలు సమావేశం ఎక్కడా జరిగింది..? ఎవరెవరు ఈ సమావేశానికి హాజరయ్యారనే వివరాలని ఇంటిలిజెన్స్ అధికారులు ఆరాతీస్తున్నారు. అంతేకాకుండా గతంలో జనశక్తి కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపైన కూడా ప్రత్యేక నిఘా ఉంచినట్టుగా తెలుస్తోంది. వారు ఏమైనా ఈ సమావేశాలకు హాజరయ్యారా..? అనే కోణంలో వివరాలను సేకరిస్తున్నారు.