ఐ  యామ్ సారీ అంటూనే టిఆర్ఎస్ ముత్తిరెడ్డి కొత్త వివాదం

First Published Dec 26, 2017, 5:20 PM IST
Highlights
  • నా మాటలు వక్రీకరించారు
  • నేను మాట్లాడిన దాంట్లో రిజర్వేషన్ల ప్రస్తావన లేదు
  • ఉందని నిరూపిస్తే దేనికైనా రెడీ
  • ఎవరైనా గాయపడతే క్షమాపణ కోరుతున్నా

వరుస వివాదాలతో వార్తల్లో నిలిచే జనగామ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొద్దిగా దిగొచ్చారు. తన మాటలతో ఎవరైనా బాధ పడితే క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. అంతటితో ఆగితే ఈ సమస్యకు పులిస్టాప్ పడేదే. కానీ ఆయన ఇంకో వివాదాన్ని రగిలించారు. అసెంబ్లీలోని టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారో వివరాలు కింద చదవండి.

రిజర్వేషన్లు తొలగించాలని తాను జనగామ సభలో మాట్లాడలేదని ముత్తిరెడ్డి వివరణ ఇచ్చారు. తన మాటలను వక్రీకరించి మీడియా రాసిందని స్పష్టం చేశారు. తాను మాట్లాడిన దానిలో ఎక్కడైనా రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తిన విషయం ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. తాను 21 నిమిషాలపాటు మాట్లాడిన దాంట్లో రిజర్వేషన్ల అంశాన్ని మాట్లాడలేదని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి రిజర్వేషన్స్ తొలగించాలని తాను అనలేదని పేర్కొన్నారు. తాను ఏ కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడలేదు. మేధస్సు కలిగిన వారికి కూడా అన్యాయం చేయొద్దని మాత్రమే అన్నానని చెప్పారు.

దళితులకు మూడేకరాల భూమి తన నియోజకవర్గంలో పంచకుండా అధికారులు అడ్డపడితే కడియం శ్రీహరికీ ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. అంబేద్కర్ గొప్పతనాన్ని అనేక సభల్లో చెప్పిన వ్యక్తినని ఖితాబు ఇచ్చుకున్నారు. దళిత సమాజం టిఆర్ఎస్ ప్రభుత్వానికి దగ్గరైందన్న అక్కస్సుతోనే కావాలని మమ్మల్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. దళితుల పట్ల తమకు చిత్తశుద్ధి వుందన్నారు. అయినా తన వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడి ఉంటే...క్షమాపణ చెబుతున్నా అని అన్నారు.

మళ్లీ కొత్త వివాదం రగలించిందిక్కడే

ఇంతవరకు బాగానే వివరణ ఇచ్చిన ముత్తిరెడ్డి సరికొత్త వివాదం రాజేశారు. రిజర్వేషన్ల ద్వారా చదువుకున్న ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ను రిజర్వేషన్ల వివాదంలోకి గుంజుకొచ్చారు. ఐసిఎస్ ప్రవీణ్ కుమార్ తన పిల్లలను రిజర్వేషన్ కోటాలో కాకుండా ఓపెన్ కోటాలో చదివిస్తున్నారని చెప్పారు. ఆయనకు హ్యాట్సాప్ చెబుతున్నానని వివరించారు. రిజర్వేషన్లు అనుభవించి పైకొచ్చిన వారంతా ఐపిఎస్ ప్రవీణ్ కుమార్ లా ప్రయత్నం చేయాలంటూ సలహా ఇచ్చారు. అప్పుడు ప్రతిభ ఉన్నవారికి అవకాశాలొస్తాయని వివరించారు. మరి ఈ వ్యాఖ్యలపై ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

click me!