జనగాం టికెట్ పల్లా రాజేశ్వర్‌కు ఫిక్స్?.. ముత్తిరెడ్డి మద్దతుతో జెండా ఎగరేద్దాం: పల్లా

Published : Sep 23, 2023, 09:50 PM IST
జనగాం టికెట్ పల్లా రాజేశ్వర్‌కు ఫిక్స్?.. ముత్తిరెడ్డి మద్దతుతో జెండా ఎగరేద్దాం: పల్లా

సారాంశం

స్టేషన్ ఘన్‌పూర్‌లో విజయవంతంగా సయోధ్య కుదిర్చిన బీఆర్ఎస్ జనగాంలోనూ ఏకాభిప్రాయాన్ని తెచ్చినట్టు సమాచారం. స్టేషన్ ఘన్‌పూర్‌లో టికెట్ కడియంకు కన్ఫామ్ అయ్యాక తాటికొండ రాజయ్యకు బీఆర్ఎస్ సర్దిచెప్పింది. జనగాంలో టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి వస్తుందనే ప్రచారం నేపథ్యంలో ముత్తిరెడ్డితో సయోధ్య కుదిర్చినట్టు తెలుస్తున్నది. పల్లా, ముత్తిరెడ్డి వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.  

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అసంతృప్తులను బుజ్జగించడం విజయవంతంగా చేపడుతున్నట్టు తెలుస్తున్నది. నిన్నే స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల మధ్య సయోధ్య కుదిర్చిన పార్టీ అగ్రనాయకత్వం.. జనగాంలోనూ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలనూ ఒక్క తాటి మీదికి తెచ్చినట్టు అర్థం అవుతున్నది. బీఆర్ఎస్ నేతలు, క్యాడర్‌ను ఉద్దేశించి పల్లా రాజేశ్వర్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మద్దతుతో, కేసీఆర్ ఆశీర్వాదంతో జనగాంలో గులాబీ జెండా ఎగరేద్దామని కామెంట్ చేశారు. దీంతో ముత్తిరెడ్డితో సయోధ్య కుదరడమే కాదు.. టికెట్ కూడా తనకే కన్ఫామ్ అయినట్టు పల్లా సంకేతాలిచ్చారు.

మార్పు జరగాలంటే ఎమ్మెల్యేలను ఒప్పించి ముందుకు సాగాలని పల్లా వివరించారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఒప్పించామని తెలిపారు. కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చినందున రాజయ్యను కలిసి మాట్లాడామన్నారు. జనగామ జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయని, జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి అని వివరించారు. ఈ మూడు నియోజకవర్గాల్లో గులాబీ జెండా తప్పక ఎగరాలని తెలిపారు. జనగామలో ముత్తిరెడ్డి మంచి పనులు చేశారని, ఉద్యమంలోనూ పాల్గొన్నారని ప్రశంసించారు. ఆ వెంటనే జనగామలో  కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ ఓడిపోయే అవకాశం ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకున్నారని పరోక్షంగా టికెట్ ముత్తిరెడ్డికి దక్కడం లేదని తెలిపారు. అయితే, సీఎం కేసీఆర్‌కు ముత్తిరెడ్డి పై గౌరవం ఉన్నదని వివరించారు. ముత్తిరెడ్డిని పిలిచి మాట్లాడుతారని, అందరమూ ఏకతాటిపైకి వెళ్దామని చెప్పారు.

ఆసక్తికరంగా ఆయన కేసీఆర్, ముత్తిరెడ్డిల ఆశీర్వాదం తీసుకున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా ముందుకు సాగి బీఆర్ఎస్‌ను గెలిపించాలని అన్నారు. త్వరలోనే జనగామ టికెట్ ప్రకటిస్తారని వివరించారు.

Also Read: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన తేదీలో మార్పు.. ఒక రోజు వాయిదా

బీఆర్ఎస్ టికెట్ ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టిన నాలుగు స్థానాల్లో జనగామ ఒకటి. ఇక్కడ ఎమ్మెల్యేను మారుస్తారని, టికెట్ ముత్తిరెడ్డికి కాకుండా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి దక్కుతుందని తెగ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పల్లా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.  ఆయనకే టికెట్ దక్కుతుందనే వాదనలకు బలాన్నిచ్చేలా మాట్లాడారు.

ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యాఖ్యలు కూడా ఈ వాదనలను బలపరిచేలా ఉన్నాయి. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని పేర్కొనడం గమనార్హం. ముత్తిరెడ్డి పై ఆయన కుమార్తె చేసిన అవినీతి ఆరోపణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. టికెట్ దక్కదనే ప్రచారం సాగినప్పుడూ ముత్తిరెడ్డి కన్నీటి పర్యంతమైన విషయమూ విధితమే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్