కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి సోమవారం నాడు న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి సోమవారం నాడు న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి ఒకే సీటు అనే విధానం వల్ల తమకు నష్టం జరుగుతోందని జానారెడ్డి భావిస్తున్నారు. కొడుకును బరిలోకి దింపేందుకు గాను రాహుల్‌గాంధీతో చర్చించేందుకు జానారెడ్డి కొడుకు రఘువీర్‌తో కలిసి సోమవారం నాడు ఢిల్లీకి వెళ్లారు.
ప్రస్తుతం నాగార్జునసాగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి జానారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే తన కొడుకు రఘువీర్‌ను కూడ బరిలోకి దింపాలని జానారెడ్డి భావిస్తున్నారు. మిర్యాలగూడ స్థానం నుండి కొడుకు రఘువీర్ ను బరిలోకి దిగింపి, తాను నాగార్జున సాగర్ నుండి పోటీ చేయాలని జానారెడ్డి భావిస్తున్నారు.
గత ఎన్నికల సమయంలోనే కొడుకును బరిలోకి దింపాలని జానారెడ్డి భావించారు. అయితే చివరి నిమిషంలో తన సన్నిహితుడు భాస్కర్ రావుకు జానారెడ్డి టిక్కెట్టు ఇప్పించారు. మిర్యాలగూడ నుండి భాస్కర్ రావు పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆ తర్వాత పరిణామక్రమంలో భాస్కర్ రావు టీఆర్ఎస్ లో చేరారు.
దీంతో మిర్యాలగూడ నుండి తాను ఈ దఫా బరిలోకి దిగాలని జానారెడ్డి భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే ఎన్నికల్లో ఒక్క కుటుంబానికి ఒకే సీటును ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.
సిట్టింగ్‌లను మినహాయిస్తే అందరికి ఈ సూత్రాన్ని వర్తింపజేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. పార్టీ తీసుకొన్న ఈ నిర్ణయాలను దృష్టిలో ఉంచుకొని జానారెడ్డి రాహుల్ గాంధీతో సమావేశమయ్యేందుకు సోమవారం నాడు ఢిల్లీకి వెళ్లారు.
గత ఎన్నికల సమయంలోనే మిర్యాలగూడ టిక్కెట్టు రఘువీర్ ను బరిలోకి దింపాలని చివరివరకు ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. దీంతో భాస్కర్ రావుకు జానారెడ్డి టిక్కెట్టును ఫైనల్ చేయించారు. అయితే ఈ దఫా మాత్రం కొడుకుకు టిక్కెట్టు కోసం జానారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.