జానా రెడ్డి మనసులో కోరిక ఇదీ: టీమ్ లీడర్ సెంచరీ కొట్టినా...

Published : May 05, 2018, 06:24 PM IST
జానా రెడ్డి మనసులో కోరిక ఇదీ: టీమ్ లీడర్ సెంచరీ కొట్టినా...

సారాంశం

తన మనసులోని కోరికను కాంగ్రెసు శాసనసభా పక్ష నేత కె. జానా రెడ్డి పరోక్షంగా వెల్లడించారు.

హైదరాబాద్: తన మనసులోని కోరికను కాంగ్రెసు శాసనసభా పక్ష నేత కె. జానా రెడ్డి పరోక్షంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవికి తనకన్నా ఎక్కువ అర్హత ఉందని ఎవరైనా అనుకుంటే పార్టీలో అందరూ అంగీకరించబోరని అన్నారు. సిఎల్పీ సమావేశానంతరం శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 

ఆరు నెలల ముందు తెలంగాణ ఇచ్చి ఎన్నికలకు వెళ్లి ఉంటే బాగుండేదని అన్నారు. కానీ కేంద్రంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన 25 మంది ఎంపీలు బయటకు వెళ్లిపోతే ప్రభుత్వం కూలిపోయేదని, దానివల్ల తెలంగాణ రాకుండా పోయేదనే చర్చ కూడా ఉందని అన్నారు. 

తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెసు ప్రణాళిక సరిగా ఉందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసును అధికారంలోకి తేవడానికి అందరం ప్రయత్నిస్తున్నామని అన్నారు. తాను సిఎం కావాలని చాలా మంది అనేవారున్నారని ఆయన అన్నారు. 

శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, సంపత్ కుమార్ ను పట్టించుకోవడం లేదనేది నిజం కాదని ఆయన అన్నారు. వారి కోసం అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టామని, అదే సమయంలో ప్లీనరీకి వెళ్లామని, ఆ ఇద్దరు కూడా ప్లీనరీకి వచ్చారని, ఇంకా ఏం చేయాలో చెప్పండని ఆయన అన్నారు. 

వారి కేసును వాదించడానికి అభిషేక్ సింఘ్వీని కోర్టుకు పిలిచింది పార్టీయేనని చెప్పారు. సింఘ్వీతో తానే మాట్లాడినట్లు తెలిపారు. ప్లీనరీకి ముందే విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకుని వెళ్లామని, లా కమిటీ సభ్యుడితో కూడా మాట్లాడి సలహా తీసుకున్నామని చెప్పారు. అభిషేక్ సింఘ్వీతో మాట్లాడిన విషయాన్ని సంపత్, కోమటిరెడ్డిలకు వివరించినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ కూడా సింఘ్వీతో ఎమ్మెల్యేల కేసు చూడాలని చెప్పారని అన్నారు. 

పార్టీ పట్టించుకోవడం లేదని సంపత్, కోమటిరెడ్డిలు చేసుకునే ప్రచారం మాత్రమేనని అన్నారు. వాళ్ల వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తామని చెప్పారు. ఫిరాయింపుదారులు రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని, దానిపై సుప్రీంకోర్టుకు సాక్ష్యం సమర్పిస్తామని చెప్పారు. 

పార్టీని గెలిపించాలని అందరం ప్రయత్నిస్తున్నామని, కొన్నిసార్లు టీమ్ లీడర్ సెంచరీ కొట్టినా మ్యాచ్ గెలవరని, కానీ లీడర్ 10 పరుగులు చేసినా ఒక్కోసారి టీమ్ గెలుస్తుందని అన్నారు. తమ స్పిరిట్ కూడా అదేనని అన్నారు. 

తన కుమారుడు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెసు పార్టీ గెలుస్తుందని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

చైనీస్ మాంజాపై సజ్జనార్ కొరడా | Sajjanar Strong Warning on Chinese Manja Sales | Asianet News Telugu
Invite KCR To Medaram Jatara: కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు| Asianet News Telugu