పోలవరంపై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ నిర్వహించిన సమావేశంలో తెలంగాణ తన వాదనలను విన్పించింది. బ్యాక్ వాటర్ పై అధ్యయనం చేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది.
న్యూఢిల్లీ:పోలవరం ముంపుపై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గురువారంనాడు సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నాలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌ఘడ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపు సమస్యలపై తెలంగాణ సహ ఇతర రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఈ విషయమై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయమై చొరవ తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది.ఈ సూచన మేరకు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ ఇవాళ సమావేశం ఏర్పాటు చేసింది.
undefined
పోలవరం బ్యాక్ వాటర్ పై మరోసారి అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశంలో డిమాండ్ చేసింది. బ్యాక్ వాటర్ కారణంగా భద్రచాలం సహా పరిసర గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తెలంగాణ అభిప్రాయపడింది. ఈ ఏడాది జూలైలో గోదావరి వరదను కూడా తెలంగాణ అధికారులు ఈ సమావేశంలో ప్రస్తావించారు.ముంపు నివారణకు రక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ కోరింది..రక్షణ కోసం నిర్మించే గోడలకు అయ్యే ఖర్చును పోలవరం అథారిటీ భరించాలని తెలంగాణ కోరింది.
ఈనెల 14 వతేదీనే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సమయం ఇవ్వకుండానే ఈ మీటింగ్ ఏర్పాటుపై ఒడిశా అభ్యంతరం తెలపడంతో ఇవాళ్టికి సమావేశాన్ని వాయిదా వేశారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పై అధ్యయనం చేయాలని ఈ నెల 22వ తేదీన తెలంగాణ ఇరిగేషన్ ప్రత్యేక సెక్రటరీ రజత్ కుమార్ కేంద్ర జల వనరుల శాఖ సెక్రటరీకి లేఖ రాశారు.
also read:రేపు పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్ర జలశక్తి శాఖ సమావేశం... హాజరుకానున్న నాలుగు రాష్ట్రాల సీఎస్‌లు
పోలవరం ప్రాజెక్టు డిశ్చార్జ్ కెపాసిటీని 30 లక్షల నుండి50 లక్షలకు పెంచడంతో తెలంగాణకు తీవ్రంగా నష్టం వాటిల్లనుందని తెలంగాణ అభ్యంతం చెబుతుంది. బ్యాక్ వాటర్ పై సీడబ్ల్యూసీ, ఎన్ఐహెచ్ సీఈలతో అధ్యయనం చేయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ ఏడాది జూలైలో గోదావరి వచ్చిన వరదతో భద్రాచలం పట్టణంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.