
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన బోనాల వేడుకల సందర్భంగా మహిళలపై వేధింపులకు పాల్పడిన 8 మంది పోకిరీలకు కోర్టు జైలు శిక్ష విధించింది. మహిళలకి తెలియకుండా వారి ఫోటోలు తీస్తూ వేధిస్తున్న పోకిరీలను అరెస్ట్ చేసిన షీ టీమ్ బృందాలు.. వారిని కోర్టులో హాజరుపరిచారు. దీంతో విచారించిన కోర్టు శిక్షలు ఖరారు చేసింది. వివరాలు.. గోల్కొండ, సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల వేడుకల సందర్భంగా షీ టీమ్ సిబ్బంది మఫ్టీలో మోహరించారు. అయితే వేర్వేరు ఘటనల్లో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న నిందితులను షీ టీమ్ సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
బోనాల వేడుకల కోసం వస్తున్న మహిళలను వారికి తెలియకుండా ఫొటోలు తీయడం, వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం, తాకడం వంటివి చేస్తూ పట్టుబడ్డారని షీ టీమ్స్ అదనపు కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ‘‘మేము వారిని కోర్టు ముందు హాజరుపరిచాము. వారిపై నమోదైన కేసులను పరిశీలించిన తరువాత.. కేసు తీవ్రతను బట్టి కోర్టు నిందితులకు జైలు శిక్ష విధించింది’’ అని ఆయన చెప్పారు.
నిందితుల్లో ఎస్ నాగరాజు, మహమూద్ ఖాన్, పి కిరణ్, షేక్ అర్జాద్ అలీలకు కోర్టు రెండు రోజుల జైలు శిక్ష విధించింది. శ్రీకాంత్, ఖాజా మసీరిద్దీన్, వై సాయిలులకు మూడు రోజుల జైలు శిక్ష, అబ్దుల్ మముద్ ఖాన్‌లకు 10 రోజుల జైలు శిక్ష విధించింది. మహిళలతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ హెచ్చరించారు.