కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి కలకలం: అందరి చూపు ఠాగూర్ వైపే

By narsimha lodeFirst Published Jan 7, 2022, 10:19 AM IST
Highlights


కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి  వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.ఈ వ్యవహరంపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏం చేస్తోందనే విషయమై సర్వత్రా చర్చ సాగుతుంది. అయితే మాణికం ఠాగూర్ తాను లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తానని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిందని జగ్గారెడ్డి చెప్పారు.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో  జగ్గారెడ్డి వ్యవహారం కలకలం రేపుతుంది. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో జగ్గారెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. పార్టీ పదవులతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.   టీపీసీసీ చీఫ్ Revanth Reddy తీరుపై  ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  Jagga Reddy అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డి  వ్యవహారంతో పాటు సోషల్ మీడియాలో పార్టీకి చెందిన కొందరు నేతలను లక్ష్యంగా చేసుకొని  టీఆర్ఎస్ కు కోవర్టులంటూ సాగుతున్న ప్రచారం విషయమై కూడా ఈ సమావేశంలో చర్చ సందర్భంగా జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పదవులతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని కూడా జగ్గారెడ్డి సవాల్ విసిరారు.గురువారం నాడు మధ్యాహ్నం సీఎల్పీ  కార్యాలయంలో పార్టీకి చెందిన కొందరు సీనియర్లు సమావేశమై జగ్గారెడ్డి విషయమై చర్చించారు. జగ్గారెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. 

సంక్రాంతి తర్వాత తాను కాంగ్రెస్ పార్టీ చీఫ్ Sonia Gandhi, మాజీ చీఫ్ రాహుల్ గాంధీలతో సమావేశం కావాలని జగ్గారెడ్డి భావిస్తున్నారు. జగ్గారెడ్డి లేవనెత్తిన అంశాలను పరిష్కరించనున్నట్టుగా మాణికం ఠాగూర్  తనకు హామీ ఇచ్చారని కూడా జగ్గారెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని కొందరు పార్టీ సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు.వ్యక్తిగత ఇమేజ్ కే రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని జగ్గారెడ్డి సోనియా గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

గతంలో కూడా రెండు మూడు దఫాలు రేవంత్ రెడ్డి వ్యవహరశైలిపై జగ్గారెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. మీడియా వేదికగా కూడా రేవంత్ రెడ్డి తీరుపై జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. పార్టీ సమావేశాల్లో కూడా ఈ విషయమై చర్చించారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల తీరుపై కూడా పార్టీ నాయకత్వం కూడా అసంతృప్తిగా ఉంది. మీడియా వేదికగా పరస్పరం విమర్శలు చేసుకోవడంపై కూడా  సోనియాగాంధీ అఃసంతృప్తితో ఉన్నారు. పార్టీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జీ కేసీ వేణుగోపాల్ కూడా ఈ విషయమై పార్టీ నేతలకు చురకలంటించారని సమాచారం. గతంలో కూడా Manickam Tagore  కు పార్టీ సీనియర్లు కొందరు రేవంత్ రెడ్డి వ్యవహరంపై ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలను కలుపుకుపోవాలని ఠాగూర్ రేవంత్ కు సూచించినట్టుగా సమాచారం. మరో వైపు జగ్గారెడ్డి వ్యవహరశైలిపై కూడా ఠాగూర్, వేణుగోపాల్ కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో జగ్గారెడ్డిని వదులుకోవడం రాజకీయంగా కాంగ్రెస్ కు నష్టమనే అభిప్రాయాలు లేకపోలేదు. జగ్గారెడ్డిని ముందు పెట్టి కొందరు సీనియర్లు రేవంత్ పై ఫిర్యాదులు చేయిస్తున్నారా అనే అనుమానాలను రేవంత్ రెడ్డి వర్గం వ్యక్తం చేస్తోంది.

తాను లేవనెత్తిన అంశాలపై ఠాగూర్ పరిష్కరిస్తారని కూడా జగ్గారెడ్డి మీడియాకు చెప్పారు.  అయితే సోనియా, రాహుల్‌లను కలిసిన తర్వాత  తన భవిష్యత్తు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు ఎఐసీసీ సెక్రటరీ ఒకరు రంగంలోకి దిగారు. రాష్ట్రానికి చెందిన కొందరు సీనియర్లు కూడా జగ్గారెడ్డిని బుజ్జగిస్తున్నారని సమాచారం. అదే సమయంలో ఠాగూర్ కూడా పార్టీ నేతల మధ్య  సమన్వయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.  మరో వైపు వి. హనుమంతరావు లాంటి నేతలు కూడా రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై ఠాగూర్ కు ఫోన్ చేసి చర్చించారు. 

 


 

 

click me!