శంషాబాద్ ఎయిర్ పోర్టులో డీజేపై దాడి

By ramya neerukondaFirst Published 25, Aug 2018, 11:55 AM IST
Highlights

అసలు ఆరోజు డెస్క్ లో ఉన్నది తమ ఎయిర్ ఇండియా శాశ్వత ఉద్యోగి కాదని.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అని వారు తెలిపారు. ఇరు వాదనలు విన్న పోలీసులు.. ఎయిర్ పోర్టులోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడతామని వివరించారు. 

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో ఇటలీకి చెందిన మహిళా డీజేకి చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియాకు చెందిన సిబ్బంది తనను చెంప దెబ్బ కొట్టినట్లు ఇటలీకి చెందిన డీజే ఓలీ ఎస్సీ ఆరోపించింది. అయితే ఎయిర్ ఇండియా మాత్రం ఆ ఘటనను ఖండించింది. ఈ ఘటన పట్ల ఎయిర్‌పోర్ట్ ఇన్స్‌పెక్టర్ మహేశ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ వెళ్లాల్సి ఉందని, కానీ ఆ రోజు ఫ్లయిట్ 9 గంటలు ఆలస్యంగా వెళ్లిందని, ఆ సమయంలో ఎయిర్ ఇండియా కౌంటర్ వద్దకు వెళ్లానని, కానీ డెస్క్ వద్ద ఉన్న ఉద్యోగి తనతో సరిగా ప్రవర్తించలేదని డీజే ఓలీ ఫిర్యాదు చేసింది. డెస్క్ వద్ద ఉన్న లేడీ ఉద్యోగి దురుస్తుగా మాట్లాడి, తనను చెంప దెబ్బ కొట్టినట్లు ఆమె వీడియోలో పేర్కొన్నది. 

అయితే.. ఎయిర్ ఇండియా అధికారులు ఆమె ఆరోపణలను ఖండించారు. మహిళా డీజే.. అనుమతి లేకుండా ఫోన్ లో వీడియో తీస్తుంటే.. అక్కడ ఉన్న ఉద్యోగి అడ్డు చెప్పారని.. అంతేకాని ఆమెపై చెయ్యి చేసుకోలేదని చెప్పారు. అసలు ఆరోజు డెస్క్ లో ఉన్నది తమ ఎయిర్ ఇండియా శాశ్వత ఉద్యోగి కాదని.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అని వారు తెలిపారు. ఇరు వాదనలు విన్న పోలీసులు.. ఎయిర్ పోర్టులోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడతామని వివరించారు. 

Last Updated 9, Sep 2018, 11:12 AM IST