మల్లారెడ్డి విద్యాసంస్థల్లో అక్రమాలు... అధిక ఫీజులు వసూలు, ఆ సొమ్మంతా ‘‘రియల్’’ పెట్టుబడులుగా

By Siva KodatiFirst Published Nov 23, 2022, 10:06 PM IST
Highlights

తెలంగాణ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బంధువుల, స్నేహితుల ఇళ్లలో రెండు రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా మల్లారెడ్డి విద్యా సంస్థల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. 

మంత్రి మల్లారెడ్డి కుటుంబ యాజమాన్యంలోని మల్లారెడ్డి విద్యాసంస్థల్లో అక్రమాలు గుర్తించామంటున్నారు ఐటీ అధికారులు. ఆయన విద్యాసంస్థల్లో అక్రమాలపై ప్రాథమిక నిర్థారణకు వచ్చింది ఐటీ శాఖ. నిర్దేశిత ఫీజుల కంటే అదనంగా వసూలు చేసినట్లు నిర్ధారించారు. వసూలు చేసిన ఫీజులను, అనధికార వసూళ్లను రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించారు. పెద్ద మొత్తంలో బ్లాక్‌లో నగదును వుంచుతున్నట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. నగదును నారాయణ ఆసుపత్రికి తరలించినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ తన కథనంలో పేర్కొంది. 

వసూలు చేసిన మొత్తాన్ని మల్లారెడ్డి- నారాయణ ఆసుపత్రి నిర్మాణానికి వెచ్చించినట్లుగా ఆధారాలు సేకరించినట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు. అలాగే స్థిరాస్తులను కూడా అసలు విలువకు తగ్గించి చూపినట్లు వారు తెలిపారు. ఇదే సమయంలో మంత్రి మల్లారెడ్డి వియ్యంకుడు వర్థమాన్ కళాశాలలో డైరెక్టర్‌గా వుండటంతో అక్కడ కూడా సోదాలు నిర్వహించినట్లుగా ఎన్టీవీ తన కథనంలో తెలిపింది. మొత్తంగా మల్లారెడ్డి , ఆయన బంధువుల ఇళ్లు , కార్యాలయాల్లో ఇప్పటి వరకు రూ.6 కొట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లుగా ఐటీ అధికారులు వెల్లడించారు. 

ALso Read:మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి బ్యాంక్ లాకర్లపై ఐటీ ఫోకస్.. కుమార్తెతో తెరిపించే యత్నం

ఇకపోతే.. ఐటీ సోదాలు జరుగుతుండగానే ఇంటి బయటకు వచ్చారు మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఐటీ సోదాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని.. కార్యకర్తలెవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఎవరితోనూ ఎలాంటి సమస్యా లేదని.. అన్ని అకౌంట్లు క్లియర్‌గా వున్నాయని మల్లారెడ్డి తెలిపారు. వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారని మంత్రి వెల్లడించారు. 

click me!