మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి బ్యాంక్ లాకర్లపై ఐటీ ఫోకస్.. కుమార్తెతో తెరిపించే యత్నం

By Siva KodatiFirst Published Nov 23, 2022, 8:04 PM IST
Highlights

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన 12 బ్యాంక్ లాకర్లపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. 

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో తనిఖీల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన బంధువుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి బ్యాంక్ లాకర్లపై ఆదాయపు పన్ను శాఖ ఫోకస్ పెట్టారు. ఆయనకు సంబంధించిన 8 బ్యాంకుల్లో 12 బ్యాంక్ లాకర్లను గుర్తించిన ఐటీ అధికారులు.... వాటిని తెరిచేందుకు రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రేయాను తీసుకెళ్లారు. దీనిలో భాగంగా ఇప్పటికే నాలుగు లాకర్లను తెరిచారు . 

ఇదిలావుండగా... మల్లారెడ్డి ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లోనూ రెండో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. 200 మందికి పైగా అధికారులు , సిబ్బంది 50 బృందాలుగా వీడిపోయి సోదాల్లో పాల్గొంటున్నారు. మంత్రి మల్లారెడ్డి తనయులతో పాటు ఆయన అల్లుడు, ఇతర బంధువుల ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మల్లారెడ్డికి చెందిన ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలతో పాటు ఆసుపత్రులు , ఆయా సంస్థల కార్యాలయాలు , డైరెక్టర్లు సీఈవోల ఇళ్లల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. కొంపల్లి, సుచిత్ర, బోయినపల్లి, దూలపల్లి, సూరారం, గండి మైసమ్మ తదితర చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 

ALso REad:క్రాంతి బ్యాంక్‌కు మల్లారెడ్డి కోడలు, మనుమరాలు.. ఎంతకీ తెరచుకోని తాళం

అటు.. మల్లారెడ్డి స్నేహితుల ఇళ్లల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంత ఆదాయం వస్తోంది, ఎంత మొత్తానికి ఆదాయపు పన్ను చెల్లించాలి , ఇప్పుడు చెల్లిస్తున్నది ఎంత అనే దానిపై లెక్కలు చూస్తున్నారు. ఇవాళ సోదాలు కొలిక్కి రాకపోతే.. రేపు కూడా తనిఖీలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మల్లారెడ్డి విద్యాసంస్థల ఆర్ధిక లావాదేవీలను కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతుండగానే , నిన్నటి నుంచి అక్కడే వున్న పనిమనిషికి ఫిట్స్ వచ్చాయి. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

మరోవైపు బాలానగర్‌లోని క్రాంతి బ్యాంక్‌లో ఐటీ అధికారులు రెండో రోజూ తనిఖీలు నిర్వహించారు. మల్లారెడ్డి కోడలు , మనవరాలిని బ్యాంక్‌కు తీసుకెళ్లి లాకర్లు తెరిచేందుకు ప్రయత్నించారు. మహిళా కానిస్టేబుల్స్ లేకుండానే వీరిని ఐటీ అధికారులు బ్యాంక్ కు తరలించడంపై టీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. అయితే తాళాలు తీసుకుని రాకపోవడంతో లాకర్లు తెరుచుకోలేదు. దీంతో అధికారులు వెనుదిరిగినట్లుగా తెలుస్తోంది. 

ఇకపోతే.. ఐటీ సోదాలు జరుగుతుండగానే ఇంటి బయటకు వచ్చారు మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఐటీ సోదాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని.. కార్యకర్తలెవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఎవరితోనూ ఎలాంటి సమస్యా లేదని.. అన్ని అకౌంట్లు క్లియర్‌గా వున్నాయని మల్లారెడ్డి తెలిపారు. వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారని మంత్రి వెల్లడించారు. 

click me!