కోదండరాం మీదకు బిజెపిని ఉసిగొల్పుతున్నరా ?

First Published Nov 25, 2017, 5:11 PM IST
Highlights
  • జెఎసి కొట్లాటకు నో పర్మిషన్
  • బిజెపి సమరభేరికి సై
  • సమస్య నిరుద్యోగులది
  • పంతం  జెఎసి మీదనా?

తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్లలో జెఎసి ఛైర్మన్ కోదండరాం ముందు వరుసలో ముందు వరుసలో ఉంటాడు. నిబద్ధత, నీతి, నిజాయితీతో ఆయన తెలంగాణ కోసం పనిచేసిండు. ఏ ఉద్దేశంతో ఆయనను జెఎసి ఛైర్మన్ గా నియమించిర్రో కానీ.. ఆ పోస్టుకు వంద శాతం ఆయన న్యాయం చేసిండు. మరి తెలంగాణ వచ్చినంక ఆయన పరిస్థితి ఎట్లుంది? ఆయనను ఎట్లైనా చేసి నల్చి పారేద్దామా అన్నరీతిలో పాలక పెద్దలు ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు? కోదండరాం ఎవరూ కోరని కోరికలు కోరుతున్నడా? యావన్మంది బలం, బలగం అంతా పాలకపక్షం వైపు చేరిపోయినంక కోదండరాం ను ఎందుకు కసిగా నల్చి పారేయాలనుకుంటన్నారు. అసలెందుకు కోదండను ఒంటరిని చేసి హింసించాలనుకుంటున్నరు? ఎందుకు పక్కవాళ్లను కోదండరాం మీదకు ఉసిగొల్పుతున్నారు? తెలుసుకునేందుకు ఈ స్టోరీ చదువుదాం.

తాజా పరిస్థితుల్లో కొలువులకై కొట్లాట సభ పేరు వినగానే తెలంగాణ సర్కారు ఒంటి మీద జెర్రులు పాములు పాకినట్లు చిర్రుబుర్రులాడుతున్నది. కొట్లాట సభ ప్రకటించిన నాటినుంచి నేటి వరకు ఆ సభ జరపకుండా అడుగడుగునా తెలంగాణ సర్కారు అడ్డుకునే ప్రయత్నం చేసింది. నక్సలైట్లు జెఎసిలో పనిచేస్తున్నారు... కొట్లాట సభ జరిపితే వారు శాంతి భద్రతల సమస్య కల్పిస్తారన్న వాదనకు సైతం దిగింది సర్కారు. అందుకోసమే సభకు అనుమతించకుండా నిరాకరించింది. ఎన్ని కాయితాలు ఇచ్చినా అనుమతి ఇవ్వకుండా కొట్టేసింది సర్కారు.  విధిలేని పరిస్థితుల్లో జెఎసి కొట్లాట సభ కోసం అనుమతించాలంటూ హైకోర్టు మెట్లెక్కింది. తుదకు హైకోర్టు తెలంగాణ సర్కారును వాయించింది. కొట్లాటసభ జరుపుకునేందుకు అనుమతివ్వాలని ఆదేశాలిచ్చింది. 48 గంటల్లోగా అనుమతివ్వాలని ఆదేశాలిచ్చింది.

ఈ పరిస్థితుల్లో ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. కొట్లాట సభ నవంబరు 30న జరుపుకునేందుకు ఖరాఖండీగా అనుమతి నిరాకరించిన తెలంగాణ ప్రభుత్వం అదే తెలంగాణ బిజెపి ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమరభేరి సభకు ఈనెల 26వ తేదీన ఎందుకు అనుమతించిందన్నది ఎవరికీ అంతుచిక్కడంలేదు. పెద్ద పెద్ద మేధావులు సైతం ఈ విషయంలో అంచనా వేయలేకపోతున్నారు. కోదండరాం జెఎసి సభ పెట్టుకుంటామంటే నెలల తరబడి పర్మిషన్లు ఇయ్యలేదు. పైగా అవమానించేలా మాట్లాడిన్రు. జెఎసి లో నక్సలైట్లు ఉన్నరని అపవాదులు మోపిర్రు. కానీ ఇలా అడగగానే అలా బిజెపి నిరుద్యోగుల సమర భేరి సభకు అనుమతి ఎలా వచ్చిందబ్బా అని మేధావులందరూ జట్టు పీక్కుంటున్నారు.

ఇంకా విచిత్రమేమంటే తెలంగాణ జెఎసి నిర్మాణంలో బిజెపి భాగస్వామి. ఆనాడు టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, న్యూడెమోక్రసీ పార్టీలతోపాటు పలు ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలన్నింటితో తెలంగాణ జెఎసి నిర్మాణమైంది. తర్వాత కాలక్రమంలో పార్టీలు, సంఘాలు బయటకు వెళ్లిపోయాయి. జెఎసి నిర్మాణం నుంచి జెఎసి ఘనతలో బిజెపి అంతటి భాగస్వామ్యం కలిగి ఉండి కూడా జెఎసి కాళ్లల్లో కట్టె పెట్టేందుకు ఎందుకు ప్రయత్నం చేసిందబ్బా అన్న అనుమానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ జెఎసి ఈనెల 30న కొలువులకై కొట్లాట సభ జరిపేందుకు తేదీని ఖరారు చేసింది. ఆ కార్యక్రమానికి అనుమతివ్వకుండా సర్కారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. ఈ తరుణంలో తెలంగాణ బిజెపి కేవలం జెఎసి సభకు నాలుగు రోజుల ముందే నిరుద్యోగుల సమరభేరి సభ పెట్టుకోవడం... దానికి అడిగిందే తడువుగా సర్కారు అనుమతించడం చూస్తే ఏదో మతలబు ఉందని తెలంగాణవాదులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గత వారం రోజుల క్రితం సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బిజెపి, టిఆర్ఎస్ నేతలు చెట్టా పట్టాలేసుకుని తిరిగారు. దోస్తులంటే వీళ్లేరా అన్నట్లు వారిద్దరూ సిటీలో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఆ పర్యటన ఫలితమా? లేక ఇంకేదైనా మతలబు ఉందో ఏమో కానీ... ఇలా అడగగానే బిజెపి నిరుద్యోగ సమర భేరి సభకు అనుమతి వచ్చేసింది. మరి కోదండరాం అడిగితేనేమో అంతగనం విసిగించి, హింసించి సభను జరగకుండా అడ్డుకుంటున్న సర్కారు.. బిజెపి వారికి ఎందుకు అనుమతించిందో చెప్పాలని అంటున్నారు తెలంగాణావాదులు.  

తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో జెఎసిని కాల్చేందుకు తాజాగా అధికార టిఆర్ఎస్ పార్టీ బిజెపిని వాడుకుంటోందన్న ప్రచారం సాగుతోంది. బిజెపి భుజాలపై తుపాకీ పెట్టి జెఎసిని కాల్చే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. అందుకోసమే జెఎసి సభకు అనుమతించకుండా అదే డిమాండ్ మీద బిజెపి సభకు అనుమతించారని చెబుతున్నారు. కొట్లాట సభను డిస్టర్బ్ చేయడం కోసం రాష్ట్ర సర్కారే బిజెపి ని పురమాయించి సమరభేరి సభను పెట్టించిందేమో అని ఓయు జెఎసి నేత ఒకరు అభిప్రాయపడ్డారు. మూడు నెలలుగా కొలువులకై కొట్లాట సభను ప్రకటించినప్పటికీ అనేకసార్లు తెలంగాణ పోలీసులు సభకు అనుమతించకుండా తెలంగాణ బిజెపి  నేతలు మాత్రం సభ పెట్టుకుంటామంటే వెంటనే సరూర్ నగర్ స్టేడియంలో అనుమతించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.

మొత్తానికి తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీ జెఎసి మద్దతుదారుగా ఉన్న బిజెపిని మెల్లమెల్లగా దూరం జరిపే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో బిజెపి రానున్న రోజుల్లో టిఆర్ఎస్ కు దగ్గరవుతుందా? లేక డిస్టెన్స్ మెంటెయిన్ చేస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. అలాగే జెఎసి ఛైర్మన్ కోదండరాం ఈ పరిణామాల నుంచి ఎలా గట్టెక్కుతారన్నది హాట్ టాపిక్ అయ్యింది.

click me!