గద్దర్... ఇది పేరు కాదు ఓ బ్రాండ్..: ఐపిఎస్ సజ్జనార్ వినూత్న నివాళి

By Arun Kumar P  |  First Published Aug 7, 2023, 1:47 PM IST

ప్రజా యుద్దనౌక గద్దర్ మృతిపై తెెలంగాణ ఆర్టిసి ఎండి విసి సజ్జనార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 


హైదరాబాద్ :ప్రజా యుద్దనౌక గద్దర్ నిన్న(ఆదివారం) సాయంత్ర తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతికి రాజకీయ నాయకులతో పాటు ఇతర రంగాల ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. చివరకు మావోయిస్టుల ఏరివేతలో కీలకంగా వ్యవహరించిన ఐపిఎస్ అధికారి విసి సజ్జనార్ కూడా గద్దర్ కు నివాళి అర్పించారు. విప్లవ గాయకుడు గద్దర్ తో మంచి అనుబంధం కలిగిన సజ్జనార్ ఎల్బీ స్టేడియంలో సందర్శనార్థం వుంచిన పార్థీవదేహాన్ని సందర్శించారు. గద్దర్ కుటుంబసభ్యులను ఓదార్చి సానుభూతి ప్రకటించారు. 

అంతకుముందు గద్దర్ మృతిపై సజ్జనార్ ఆసక్తికర ట్వీట్ చేసారు. గద్దర్... ఇది పేరు కాదు ఓ బ్రాండ్ అని పేర్కొన్నారు. విప్లవోద్యమ ప్రయాణానికి ఆయన  రధసారథిగా వ్యవహరించారని అన్నారు.ఎప్పుడూ పేదల పక్షానే నిలిచి పోరాటాలు చేసారని... ఎన్నో ప్రభుత్వాలను ప్రశ్నించారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర మరిచిపోలేనిదని... ఆయన ఎన్నోసార్లు తన పోరాటాల గురించి తనతో చెప్పేవారని సజ్జనార్ గుర్తుచేసుకున్నారు. 

Latest Videos

పది సంవత్సరాలు గద్దర్ తో తనకు పరిచయం వుందని... పలు సందర్భాల్లో తనపై నమోదైన కేసుల విషయంతో కలిసేవారని సజ్జనార్ తెలిపారు. ఈ సమయంలో ప్రజా ఉద్యమాల గురించి తమ మద్య చర్చ జరిగేదన్నారు. ఉద్యమాలంటే కేవలం ప్రభుత్వాలను వ్యతిరేకించేవి కావని... ప్రజల హక్కులను కాపాడేవని కొత్త అర్థం చెప్పారన్నారు. ఇలా తాను చెప్పాల్సిన విషయాలను చాలా మృదువుగా చెప్పేవారన్నారు. 

Read More  పాట బతికున్నంత కాలం గద్దర్ కూడా బతికే వుంటారు..: మంత్రి ఎర్రబెల్లి

గద్దర్ ఎంత పెద్ద రాజకీయ నాయకులనైనా, అధికారులనైనా అన్నా అంటూ ఆప్యాయంగా సంబోధించేవారని సజ్జనార్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నాయకులు ఎంతమందివున్నా స్వరాష్ట్రాన్ని సాధించిన ఘనత పాటల తల్లిదేనని గద్దర్ గొప్పగా చెప్పుకునేవారని సజ్జనార్ అన్నారు. ఉద్యమకారులు ఎవరు చనిపోయిన తన పాటతో నివాళి అర్పించే గద్దర్ కు ఇప్పుడు మనందరం నివాళి అర్పించడం బాధాకరమని సజ్జనార్ అన్నారు. 

పాట ఎంతకాలం నిలిచివుంటుందో గద్దర్ కూడా అంతకాలం బ్రతికే వుంటారని ఆర్టిసి ఎండి పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన గద్దర్ ఆర్టిసి కార్మికుల కష్టాలపై పాట రాస్తానని చెప్పారన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టిసి పాత్ర, బస్సుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారని అన్నారు. అంతలోనే గద్దర్‌ మరణవార్త వినడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సజ్జనార్ అన్నారు. 

click me!