ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన విషాద ఘటన ఆదిలాబాద్ లో చోటుచేసుకుంది. పరీక్ష రాయలేకపోవడంతో మనస్థాపానికి గురయిన యువకుడు సూసైడ్ చేసుకున్నాడు.
ఆదిలాబాద్ : ఇంటర్మీడియట్ పరీక్షల వేళ ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్న విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పరీక్ష కేంద్రానికి వెళ్లడం ఆలస్యం కావడమే అతడి ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. ఎగ్జామ్ రాయలేకపోయిన అతడు నేరుగా ఓ నీటికెనాల్ వద్దకు వెళ్లి సూసైడ్ చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే... ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మాంగుర్ల గ్రామానికి చెందిన శివకుమార్ ఇటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదవుతున్నాడు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న అతడు ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో నిన్న(గురువారం) ఉదయం పరీక్ష రాసేందుకు ఇంటినుంది బయలుదేరిన అతడు సమయానికి సెంటర్ కు చేరుకోలేకపోయాడు.
మాంగుర్ల గ్రామం నుండి ఆదిలాబాద్ కు వెళ్లేందుకు సరైన రవాణా సదుపాయం లేదు. దీంతో చాలా తొందరగానే రెడీ అయిన శివకుమార్ ఓ షేరింగ్ ఆటో, మరో బైకర్ ను లిప్ట్ అడిగి ఎలాగోలా సాత్నాల బస్టాండ్ కు చేరుకున్నాడు. కానీ అప్పటికే పరీక్షా సమయం మించిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన శివకుమార్ పరీక్షా కేంద్రానికి కాకుండా సాత్నాల కెనాల్ వద్దకు వెళ్ళడు. అక్కడే సూసైడ్ లెటర్ రాసి కెనాల్ లో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
శివకుమార్ ఆత్యహత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు సాత్నాల కెనాల్ వద్దకు చేరుకున్నారు. యువకుడి సూసైడ్ లెటర్ ను స్వాధీనం చేసుకుని గజ ఈతగాళ్లతో మృతదేహాన్ని వెలికితీసారు. అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కొడుకు మరణవార్త విని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.