కేన్సస్‌: కూచిబొట్ల హత్య ప్లేస్‌కు 32కి.మీ. దూరంలో శరత్ హత్య

First Published Jul 8, 2018, 5:23 PM IST
Highlights

అమెరికా కేన్సస్ లో మరో భారతీయుడి హత్య జరిగింది. 2017 లో కూచిబొట్ల శ్రీనివాస్ మర్డర్ జరిగింది. ఈ హత్య జరిగిన ప్రదేశానికి 32 కి.మీ. దూరంలో శరత్ అనే విద్యార్ధి తాజాగా హత్యకు గురయ్యాడు.

హైదరాబాద్: అమెరికాలో  తెలుగువారు అనేక మంది ఇటీవల కాలంలో హత్యకు గురౌతున్నారు.  అమెరికాలో కేన్సస్ ప్రాంతంలో ఇద్దరు తెలుగువారు హత్యకు గురయ్యారు. 2017లో కూచిబొట్ల శ్రీనివాస్ అనే టెక్కీని ఆడమ్స్ అనే అమెరికన్ కాల్చి చంపాడు.తాజాగా శరత్ అనే విద్యార్ధిపై రెస్టారెంట్‌లో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో అతను మరణించాడు.

2017 ఫిబ్రవరి 22వ తేదీన  కూచిబొట్ల శ్రీనివాస్ అనే టెక్కి తన స్నేహితుడు అలోక్ మదసాని ఓ బార్‌లో  ఉన్న సమయంలో ఆడమ్స్  అనే అమెరికన్ జాతివివక్షతో  కూచిబొట్ల శ్రీనివాస్‌పై తుపాకీతో కాల్పులు జరిపాడు.  కూచిబొట్ల శ్రీనివాస్ బార్‌లోనే మృతి చెందాడు.

ఈ ఘటనపై అప్పట్లో పెద్ద ఎత్తున అమెరికా తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కేన్సన్ గవర్నర్ అప్పట్లో నష్టనివారణ చర్యలకు దిగాడు. భారతీయులకు తాము అన్ని రకాల రక్షణ కల్పిస్తామని ప్రకటించారు.  ఈ ఏడాది జనవరి 30న వైట్‌హౌజ్‌లో జరిగిన స్టేట్ ఆఫ్ యూనియన్ కార్యక్రమానికి కూచిబొట్ల శ్రీనివాస్ సతీమణి సునయనకు ట్రంప్ ఆహ్వానం పంపారు.

కూచిబొట్ల శ్రీనివాస్ తన స్నేహితుడితో సరదాగా  గడిపేందుకు బార్‌కు వచ్చిన సమయంలో ఆడమ్స్ జాతివివక్షతో కాల్పులు జరిపి చంపాడు. ఆడమ్స్‌కు అమెరికా ఫెడరల్ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్షను విధించింది.

కూచిబొట్ల శ్రీనివాస్‌పై కాల్పులు జరిగిన ప్రదేశానికి 32 కి.మీ. దూరంలోనే  తాజాగా శరత్‌పై   రెస్టారెంట్‌లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు.ఈ కాల్పుల్లో శరత్ అక్కడికక్కడే మరణించాడు. శరత్ అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు. తీరిక సమయంలో రెస్టారెంట్ లో పనిచేస్తున్నాడు. ఆరు మాసాల క్రితమే అమెరికాకు వెళ్లాడు. సోదరి పెళ్లి కోసం హైద్రాబాద్ వస్తానని తల్లిదండ్రులకు చెప్పాడు.

హత్యకు గురికావడానికి కొద్ది గంటల ముందే వాట్సాప్ ద్వారా తల్లికి తన ఫోటోనే షేర్ చేశాడు. శరత్ మరణించిన విషయం తెలుసుకొన్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  మృతుడి కుటుంబసభ్యులను మంత్రులు ఓదార్చారు. శరత్ మృతదేహం హైద్రాబాద్ రప్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

కేన్సస్‌లో ఇద్దరు భారతీయులు అందులో తెలుగువాళ్లు హత్యకు గురయ్యారు.అమెరికాలో ఈ రకంగా హత్యకు గురికావడం పట్ల అమెరికాలో నివాసం ఉంటున్నవారు ఆందోళన చెందుతున్నారు.  

click me!