వంశీరామ్ బిల్డర్ సంస్థలో ఐటీ సోదాలు: హైద్రాబాద్‌లో 15 చోట్ల తనిఖీలు

By narsimha lodeFirst Published Dec 6, 2022, 9:19 AM IST
Highlights

 వంశీరామ్  బిల్డర్ సంస్థ యజమాని  సుబ్బారెడ్డి అతని బంధువుల ఇళ్లలో ఇవాళ ఉదయం నుండి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.హైద్రాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లోని ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
 

హైదరాబాద్: ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి  వంశీరామ్ బిల్డర్ సంస్థకు చెందిన సుబ్బారెడ్డి , అతని బంధువుల ఇళ్లలో  మంగళవారంనాడు ఉదయం నుండి  ఐటీ అధికారులు సోదాలు  చేస్తున్నారు.నగరంలోని జూబ్లీహిల్స్ లో గల ఆయన నివాసంతో పాటు కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారు 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సుబ్బారెడ్డి నివాసంతో పాటు ఆయన బావమరిది  జనార్ధన్ రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.  

ఈ రెండు నివాసాలతో పాటు  వంశీరామ్  బిల్డర్స్ సంస్థ కార్యాలయాల్లో సోదాలు సాగుతున్నాయి. సుబ్బారెడ్డి, జనార్ధన్  రెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.ఇవాళ ఉదయం  6:40 గంటలకు  ఐటీ అధికారులు  వంశీరామ్  బిల్డర్స్ కు చెందిన సుబ్బారెడ్డి  నివాసంలో  సోదాలను ప్రారంభించారు. నాలుగు వాహనాల్లో  సుమారు  12 మంది  ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

వంశీరామ్ బిల్డర్స్ సంస్థ డైరెక్టర్లు, జ్యోతి, శైలజారెడ్డి ఆస్తులపై కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వంశీరామ్ బిల్డర్స్ సీఈఓ, డైరెక్టర్ల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్లాట్  కొనుగోలు దారులనుండి  జరిగిన లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో 80కిపైగా ప్రాజెక్టులను వంశీరామ్  బిల్డర్స్ చేపట్టింది.లగ్జరీ విల్లాలు, కమర్షియల్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఈ సంస్థ చేపట్టింది. ఈ సంస్థ ఆర్దిక లావాదేవీలపై ఆరా  తీస్తున్నారు ఐటీ అధికారులు.

తెలంగాణ రాష్ట్రంలో  ఇటీవల కాలంలో ఐటీ, ఈడీ సోదాలు ప్రతి రోజూ ఏదో  ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. గత మాసంలో  తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి నివాసంలో  రెండు రోజుల పాటు నిర్వహించిన ఐటీ సోదాలు కలకలం రేపాయి. అంతకుముందు  తెలంగాణ మంత్రి  గంగుల కమలాకర్  నివాసంలో  ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా  సోదాలు నిర్వహించాయి. బీజేపీకి వ్యతిరేకంగా  టీఆర్ఎస్  తన పోరాటాన్ని ఉధృతం  చేయడంతో  ఐటీ, ఈడీ దాడులతో  తమను భయబ్రాంతులు చేసేందుకు బీజేపీ  ప్రయత్నాలు చేస్తుందని  టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. 

click me!