
తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకూ కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఒకవైపు సిఎం కేసిఆర్ అంతకంతకూ బలోపేతమయ్యే ప్రయత్నాలు చేస్తుండగా ఆయనకు కౌంటర్ ఇచ్చేందుకు కూడా లీడర్లు రెడీగా తయారైతున్నరు. తాజా పరిణామాలు చూస్తే.. తెలంగాణలో టిడిపి ఓటు బ్యాంక్ కూడా తమకు అనుకూలంగా మలచుకునేందుకు కేసిఆర్ ఒక ప్రయోగం మొదలు పెట్టారు. అనంతపురం వెళ్లడం, అక్కడ పయ్యావుల కేశవ్ తో రహస్య సంభాషణలు చేయడం, ఎపి సిఎం చంద్రబాబును కలిసి ఆప్యాయంగా మాట్లాడడం జరిగిపోయాయి. ఈ పరిణామాలు చూస్తే టిడిపి, టిఆర్ఎస్ కలిసిపోతాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దానికి బలం చేకూర్చేలా అవసరమైతే టిఆర్ఎస్ తో కలుస్తాం కానీ కాంగ్రెస్ తోటి కలిసేదే లేదు అని మోత్కుపల్లి తూటాలు పేల్చారు. ఈ తరుణంలో టిడిపి, టిఆర్ఎస్ మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ డెవలప్ అయితూ ఉన్నది. కానీ ఒక్కసారిగా ఆ రిలేషన్ ను ఖరాబ్ చేసి పడేవారు తెలంగాణ టిడిపి నేత రేవంత్. శనివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో మీడియాతో మాట్లాడారు రేవంత్. ఆ విలేకరుల సమావేశంలో ఏకకాలంలో ఇద్దరు తెలుగు రాష్ట్రాల సిఎంలను ఇరకాటంలో పడేశారు. ఆ ఇరకాటమేందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
తెలుగుదేశం అనగానే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అని చెప్పుకుంటారు. ఇప్పటి వరకు ఆ ఇమేజ్ ను ఆ పార్టీ నిలబెట్టుకుంది. కానీ తాజా పరిణామాలు చూస్తే కొంత గందరగోళం నెలకొంది. తెలంగాణలో కాంగ్రెస్ తో టిడిపి దోస్తాన్ చేస్తుందా అన్న వాతావరణం ఉండే. కానీ ఇప్పడు చెడిపోయినట్లు చెబుతున్నారు. అయితే అంతటి కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ అయిన టిడిపి ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో రేవంత్ మీడియా సమావేశం జరిపారు. అందులో కేసిఆర్ పై మాటల దాడి చేశారు. బండ బూతులు తిట్టి పడేశారు. సందుట్లో సడేమియా అన్నట్లు ఆ మీడియా సమావేశంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని మెచ్చుకున్నారు. సోనియా దయ తలిస్తే తెలంగాణ వచ్చిందన్నారు. ఆమె కాళ్లు మొక్కి నమ్మక ద్రోహం చేశావంటూ కేసిఆర్ ను ఉతికి ఆరేశారు. మొత్తానికి కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ ప్రధాన వేదిక మీద కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని పొగడ్తలతో ముంచెత్తడం చర్చనీయాంశమైంది. తర్వాత చంద్రబాబును కూడా కొద్దిగా మెచ్చుకున్నారనుకోండి. సోనియా గాంధీనే బాబు కంటే ఎక్కువ మెచ్చుకున్నరు. దీంతో మన పార్టీ వేదిక మీద కాంగ్రెస్ నాయకురాలిని పొగుడుడు ఏందబ్బా అని పార్టీ నేతలు హైబత్ అయితున్నరు. మరోవైపు టిఆర్ఎస్ తో కలిసి పనిచేస్తే తమ ఇంటివాళ్లే ఇంట్లకు కూడా రానీయరని పార్టీ పెద్ద లీడర్లందరికీ జలక్ ఇచ్చారు రేవంత్.
ఇక కేసిఆర్ ను కూడా ఇదే వేదిక మీదినుంచి రేవంత్ ఇరకాటంలోకి నెట్టేశారు. అదేమంటే.. కోదండరాం మీద కేసిఆర్ చేసిన ఆరోపణలకు కౌంటర్ వేశారు. కోదండరాం ఎప్పుడైనా తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతచారి కుటుంబాన్ని పరామర్శించిండా అని ప్రశ్నించారు. అటువంటి కోదండరాం కు అమరుల స్పూర్తి యాత్ర చేసే హక్కు ఉందా అని అన్నారు. అది అమరుల యాత్రనా లంగా యాత్రనా అని కూడా తిట్లు అందుకున్నారు. ఇదే విషయమై కేసిఆర్ కు రేవంత్ కౌంటర్ ఇచ్చారు. శ్రీకాంతచారి కుటుంబాన్ని కోదండరాం పరామర్శించలేదంటున్నవు కదా? నువ్వు అంత సక్కగున్నవనుకుంటే రేపు నల్లగొండ ఉప ఎన్నికలో శ్రీకాంతచారి తల్లి శంకరమ్మను నిలబెడదాం. ఏకగ్రీవంగా గెలిపిద్దాం. అందుకోసం మిగతా అన్ని పార్టీలతోటి నేను మాట్లాడి ఒప్పిస్తా.. నువ్వు సిద్ధమేనా కేసిఆర్.. అని ప్రశ్నించారు రేవంత్. మరి కేసిఆర్ కోదండరాం ను ఈ విషయంలో తిట్లతో విమర్శించిన నేపథ్యంలో రేవంత్ లెవనెత్తిన అంశం కూడా బాగానే ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మరి ఈ ప్రతిపాదన మీద టిఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
మొత్తానికి టిఆర్ఎస్, టిడిపి ఫ్రెండ్ షిప్ పై పుకార్లు వస్తున్న తరుణంలో రేవంత్ ఇలా ఇరు పార్టీల అధినేతలకు గట్టి షాక్ ఇచ్చి ఇరికించడంతో రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి