Hyderabad: 'మధ్యాహ్న భోజన పథకం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. మార్కెట్లో ధరలు హెచ్చుతగ్గులకు లోనైతే పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం బడ్జెట్ పెంచాలి. చాలా పాఠశాలల్లో వంట గదులు సరిగా లేకపోవడంతో బయట చెట్ల కింద వంట చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురైన సందర్భాలున్నాయని' కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
TPCC president Revanth Reddy: పాఠశాల విద్యార్థులకు సీఎం అల్పాహారం పథకం అమలు గురించి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాఠశాల విద్య, విద్యార్థులు, వారికి అందిస్తున్న భోజనం, పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు సహా పలు అంశాలను ప్రస్తావిస్తూ సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు చెల్లించకపోవడం, పెరిగిన ధరలకు అనుగుణంగా వంట నిర్వహణ ఖర్చులు చెల్లించకపోవడం, గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయకపోవడం, కట్టెల పొయ్యిలపై వంట చేయడం వంటివి రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న తీరు అని రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకం అనేక సమస్యలతో సతమతమవుతుంటే ఈ సమస్యలపై దృష్టి పెట్టకుండా సీఎం అల్పాహార పథకాన్ని ప్రారంభించేందుకు హడావుడి చేస్తున్నారన్నారు.
'మధ్యాహ్న భోజన పథకం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. మార్కెట్లో ధరలు హెచ్చుతగ్గులకు లోనైతే పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం బడ్జెట్ పెంచాలి. చాలా పాఠశాలల్లో వంట గదులు సరిగా లేకపోవడంతో బయట చెట్ల కింద వంట చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురైన సందర్భాలున్నాయని' కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పెంచిన జీతాలు విడుదల చేయాలని, కొత్త మెనూకు బడ్జెట్ పెంచాలనీ, పెండింగ్ బిల్లుల విడుదల చేయాలని, జీవో 8 ప్రకారం బకాయిలతో సహా పెంచిన వేతనాలు వెంటనే చెల్లించాలనీ, ఐడీ కార్డులు, కార్మికులకు యూనిఫాం, నిత్యావసర సరుకులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
మరోవైపు రాష్ట్రంలో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ అధ్వానంగా తయారైందన్నారు. ఎక్కడా మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదనీ, నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్నారు. సగం వండిన ఆహారం, నీరు, అపరిశుభ్ర వాతావరణం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలు తరచూ చూస్తూనే ఉన్నామని అన్నారు. నాణ్యమైన ఆహారం కోసం విద్యార్థులు నిరసన వ్యక్తం చేసిన సంఘటనలు కూడా చూశామనీ, మధ్యాహ్న భోజనానికి ఒక్క పూట కూడా వండలేక, బిల్లులు చెల్లించక అప్పులపాలైనప్పుడు అల్పాహారం పథకానికి డబ్బులు ఎలా ఖర్చు చేస్తారని మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు అల్పాహారం తయారు చేసే క్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులపై అదనపు భారం పడుతోంది. దానికి అనుగుణంగా కనీస వేతనాన్ని నిర్ణయించాలని పేర్కొన్నారు.