నేను కాంగ్రెస్ మనిషినే.. కానీ: బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Published : Jul 06, 2022, 06:40 PM IST
నేను కాంగ్రెస్ మనిషినే.. కానీ: బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి

సారాంశం

ఇటీవలే బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాను కాంగ్రెస్ మనిషినేనని పేర్కొనడం సంచలనంగా మారింది. తాను కాంగ్రెస్ మనిషినని, కానీ, న్యాయం జరిగే చోటే ఉంటానని ఆయన మీడియాతో చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను ఆపే శక్తి బీజేపీకే ఉన్నదని వివరించారు.  

హైదరాబాద్: చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్ మాజీ నేత, ప్రస్తుత బీజేపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు చర్చను లేవదీశాయి. నిన్నగాక మొన్ననే బీజేపీలో చేరిన ఆయన తాను కాంగ్రెస్ మనిషినే అని పేర్కొనడం సంచలనంగా మారింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సాధారణ రాజకీయ నేతలకు కొంత భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఆయనకు కాంగ్రెస్‌తో విడదీయరాని సంబంధం ఉన్నది.

తెలంగాణ సమరయోధుడైన కొండా వెంకట రంగా రెడ్డి మనవడే కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వెంకట రంగారెడ్డి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన చేసిన కృషికి గుర్తుగానే ప్రస్తుతం ఆయన పేరిటనే మనం పిలుచుకుంటున్న రంగారెడ్డి జిల్లాకు పేరు పెట్టారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌ను దగ్గరగా చూస్తూ పెరిగారు. రాజకీయాల్లోనూ ఆ పార్టీ నుంచే పట్టు పెంచుకున్నాడు. కానీ, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపుతో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2014లో చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచారు. కానీ, ఆ తర్వాత కొన్ని కారణాల రీత్యా టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు బీజేపీ పార్టీలోకి మారారు.

పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, సీనియర్ నేతల సమక్షంలో కమలం పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన తర్వాత కొండా విశ్వేశ్వర్ రెడ్డి తొలిసారిగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

తాను కాంగ్రెస్ పార్టీకి 2021లో రాజీనామా చేసినప్పటి నుంచి తటస్థంగానే ఉన్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. అప్పుడు ఎవరూ ఏమీ అనలేదని, ఏమీ పట్టించుకోలేదని అన్నారు. కానీ, ఇలా బీజేపీలో చేరగానే.. అలా తనపై వ్యాఖ్యలు వస్తున్నాయని, చాలా మంది తనను అడుగుతున్నారని వివరించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను అడ్డుకోవడం బీజేపీకే సాధ్యం అని అన్నారు. కాబట్టి.. తాను టీఆర్ఎస్‌ను అడ్డుకోవడానికి బీజేపీలో చేరారని తెలిపారు. తాను కాంగ్రెస్ మనిషినేనని ఈ సందర్భంగా అన్నారు. కానీ, ప్రజలకు న్యాయం జరిగే చోటే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో మూడే నడుస్తున్నాయని, ఒకటి కాళ్లు మొక్కించుకోవడం, రెండూ.. డబ్బులు దండుకోవడం, మూడు.. కేసులు బనాయించి బెదిరించడం అంటూ ఆయన గులాబీ పార్టీపై విమర్శలు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu
Holidays : ఈ వీక్ లో ఇంకా ఒక్కటే వర్కింగ్ డే.. మిగతా వారమంతా సెలవులే.. నెక్ట్స్ మండే వరకు ఎంజాయ్