టికెట్ 100 శాతం నాకే వస్తుంది.. లిస్ట్ వచ్చేదాకా ఆగండి: మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి

By Mahesh K  |  First Published Aug 19, 2023, 1:37 PM IST

షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవాలని, వాటిని నమ్మి గందరగోళపడవద్దని చెప్పారు. బీఆర్ఎస్ టికెట్ 100 శాతం తనకే వస్తుందన్న నమ్మకం ఉన్నదని వివరించారు.
 


హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల రాజకీయం జోరందుకుంది. కొందరు సేఫ్‌గా ఊపిరి పీల్చుకుంటూ ఉండగా.. మరికొందరు నేతలు గందరగోళంలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం కొందరు తమ సీట్లు గల్లంతవుతున్నాయని కలవరపడుతున్నారు. ఇక ఆశావాహుల్లోనూ ఈ కన్ఫ్యూజన్ ఉన్నది. అధికారికంగా బీఆర్ఎస్ ఏ జాబితా విడుదల చేయకపోయినప్పటికీ అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలపై చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి నేతలు, కార్యకర్తలు, ప్రజలు కన్ఫ్యూజ్ కావొద్దని, వంద శాతం టికెట్ తనకే వస్తుందనే నమ్మకం ఉన్నదని అన్నారు.

మీడియాలో వస్తున్న కొన్ని వార్తలు గందరగోళపరుస్తున్నాయని, ఆ వార్తలు వాస్తవం కాదని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వార్తల వల్ల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పారు. కొన్ని రోజులు ఓపిక పట్టాలని, అలాగైతే బీఆర్ఎస్ నుంచి లిస్ట్ బయటకు వస్తుందని వివరించారు. అప్పుడు వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు.

Latest Videos

పార్టీ ఎవ్వరికి టికెట్ ఇచ్చినా అందరూ కట్టుబడి పని చేయాలని ఆయన సూచిస్తూనే బీఆర్ఎస్ టికెట్ 100 శాతం తనకే వస్తుందని నమ్ముతున్నట్టు వివరించారు. పార్టీలోని ఇతర నేతల మద్దతు తనకే ఉన్నదని తెలిపారు. తనకు టికెట్ ఇస్తే 100 శాతం గెలుస్తానని ప్రతాప్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఆశీర్వాదంతో షాద్ నగర్ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేస్తానని చెప్పారు. టికెట్ వచ్చినా.. రాకున్నా తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కేసీఆర్ సారథ్యంలోనే నడుస్తానని ప్రతాప్ రెడ్డి చెప్పారు.

Also Read: బైక్‌ను ఢీకొట్టి.. మూడు కిలోమీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లిన కారు.. బైక్ పైనే ఇద్దరు వ్యక్తులు (Video)

అంతేకాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం షాద్ నగర్ నుంచి పోటీ చేస్తే తాము ఆయనను తెలంగాణలోనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రతాప్ రెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు తిరుగే లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ హ్యాట్రిక్ కొడుతారు రాసిపెట్టుకోండని అన్నారు.

ఇప్పటికే టికెట్ల విషయమై ఉమ్మడి వరంగల్‌లో రచ్చ జరుగుతున్నది. స్టేషన ఘన్ పూర్ టికెట్ కడియం శ్రీహరికి ఇస్తారనే వార్తలతో ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్య అనుచరులు, జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇస్తారనే సమాచారంతో ముత్తిరెడ్డి అనుచరులు ఆందోళనలు చేస్తున్నారు.

click me!