నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదు : బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్

By Bukka SumabalaFirst Published Aug 11, 2022, 6:46 AM IST
Highlights

తాను ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఖండించారు. తాను పార్టీలో వర్కర్ ను మాత్రమేనని అన్నారు. 

హైదరాబాద్ : తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని అంటూ వస్తున్న  వార్తలను హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ ఖండించారు. బిజెపి క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. పదవులు, వ్యక్తులుగా నిర్ణయించుకోలేరని  పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తారని వివరించారు. నేతల సామర్థ్యాన్ని గుర్తించి పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుందని  అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఈటెల రాజేందర్ అంటూ పలు పత్రికలు, ఛానళ్లు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కెసిఆర్ నియంతృత్వ పాలన అంతమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కాషాయ జెండాను ఈ గడ్డమీద ఎగరవేయడం కోసం పార్టీ ఏ బాధ్యత అప్పగించినా శక్తివంచన లేకుండా నిర్వహిస్తానని ఈటల రాజేందర్ తెలిపారు. 

ఇదిలా ఉండగా, బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మీద టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆగస్టు రెండో తారీకు హైదరాబాద్ లో మాట్లాడుతూ ఈటెలను బ్రోకర్ అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేరికల కమిటీ లేదని.. కానీ, తెలంగాణ బిజెపిలో మాత్రమే ఉన్నదని పార్టీపై విమర్శలు సంధించారు. ఈ కమిటీకి ఈటెల రాజేందర్ చైర్మన్ గా ఉన్నాడని పేర్కొన్నారు. ఆయన చేరికల కమిటీ చైర్మన్ కాదని, బ్రోకర్ల కమిటీ చైర్మన్ అని విమర్శలు చేశారు. ఈటెల రాజేందర్ హుజురాబాద్ యాక్టర్ అని, హైదరాబాద్ లో జోకర్ అని.. అదే ఢిల్లీలో అయితే బ్రోకర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

Etela: 'త్వరలో ఊహకు అందని రీతిలో బీజేపీలో చేరికలు.. నెక్స్ట్ టార్గెట్ కేసీఆరే..': ఈటెల సెన్సెషనల్ కామెంట్స్

నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశాడో చూపించాలని సవాల్ విసిరారు. ఆయన చేసిన అభివృద్ధిని చూపిస్తే.. తాను కూడా కెసిఆర్ ఏం అభివృద్ధి చేశాడు చూపిస్తానని అన్నారు. ‘ఇక్కడ ఏం అభివృద్ధి చేశానని గజ్వేల్ కు వెళతా అంటున్నావు’ అని నిలదీశారు..  దమ్ముంటే తనతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ లో మళ్లీ గెలిచి పది నెలలు అయిందని ఒక్క లక్ష రూపాయల అభివృద్ధి అయినా చేసిండా? అని ప్రశ్నించారు. అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఈటెల నిదులు తేలేదని, ఆ పార్టీ ఎంపీలు తెలియదని అన్నారు. ఈటెల కేంద్రం నుంచి 100 కోట్ల నిధులు తెస్తే, తాను టిఆర్ఎస్ నుంచి 120 కోట్ల నిధులు తెస్తా.. అని సవాల్ విసిరారు.ఈటెల స్వగ్రామం కమలాపూర్ లో  కనీసం బస్టాండ్ కూడా కట్టలేని దౌర్భాగ్యస్థితి ఆయనదని అన్నారు. 

click me!