సుహా జుబేర్ చిన్నపిల్లల్లో మెల్లకన్ను సమస్యను వేగంగా గుర్తించి చికిత్స అందించే థెరపీని కనుగొన్నారు. ఇందుకు గాను ఆమెకు ప్రతిష్టాత్మకమైన డయానా అవార్డు దక్కింది. 18 ఏళ్ల సుహా జుబేర్ హైదరాబాదీనే.
హైదరాబాద్: 18 ఏళ్ల హైదరాబాదీ బాలిక సుహా జుబేర్‌ను ప్రఖ్యాత డయానా అవార్డు వరించింది. తన కమ్యూనిటీలో సానుకూల మార్పు కోసం కంకణం కట్టిన సుహా జుబేర్‌కు అరుదైన గౌరవం దక్కింది. వేల్స్ రాణి డయానా పేరుపై 1999లో ఈ అవార్డును స్థాపించారు. మానవాళి కోసం సేవలు అందించిన చిన్నారులకు అందించే ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఇది ముఖ్యమైనది. తొమ్మిదేళ్ల నుంచి 25 ఏళ్ల లోపు ఉండి.. ఒక కమ్యూనిటీ పురోగతికి కృషి చేసిన వారికే ఈ అవార్డు ఇస్తారు.
సుహా జుబేర్ నీట్‌కు ప్రిపేర్ అవుతున్నారు. ఆమె పిల్లల్లో అప్పుడే మెల్లకన్ను వచ్చినవారికోసం ఆమె అద్భుత చికిత్స మార్గాన్ని కనుగొంది. మెల్లకన్నుకు విరుగుడుగా యాప్ ద్వారా ఒక థెరపీని తయారు చేశారు. ఆ పేషెంట్‌కు మెల్లకన్ను ఉన్నదా? లేదా? అని నిర్ధారించి, ఒక వేళ మెల్లకన్ను ఉంటే దాని నుంచి ఉపశమనం పొందడానికి చేయాల్సిన పనులను థెరపీగా రూపొందించారు.
సుహా సోదరుడు మెల్లకన్నుతో బాధపడ్డాడు. అతడిని వైద్యుల వద్దకు నాలుగు నెలలు తీసుకెళ్లారు. చివరకు అంధుడిగా మారే ముప్పునూ ఆయన ఎదుర్కొన్నాడు. 2018లో ఆమె మెల్లకన్నుకు చికిత్స అందించాలనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
ఆమె తొమ్మిదేళ్లప్పుడే తొలిసారిగా ఆమె స్నేహితుల్లో మెల్లకన్ను ఉన్న ఒకరికి సహాయం చేయడం మొదలు పెట్టారు. సుహా సంకల్పంతో ఆమె కమ్యూనిటీలోని 50 మందికి సరైన చికిత్స అందించారు. మెల్లకన్నును గుర్తించడంలో ఆలస్యం చేస్తే వచ్చే ముప్పుపైనా ఆమె అవగాహన పెంచారు.
Also Read: Islam Nusantara: ఐఎస్ఐఎస్ తీవ్రవాద భావజాలానికి ఇండియోనేషియా కౌంటర్ ఇదే
డయానా అవార్డు పొందడంపై సుహా సియాసత్‌తో మాట్లాడారు. తనకు ఈ అవార్డు దక్కడం గర్వంగా ఉన్నదని, తన జీవితంలో ఇదో గొప్ప మైలురాయి అని వివరించారు. ఈ గుర్తింపు తనలో మరింత ప్రేరణను నింపడమే కాదు.. మానవాళికి ఇంకా సేవ చేయాలనే తపనను ప్రోది చేసిందని తెలిపారు.
ఆమె పరిసరాల్లో మెల్లకన్ను సమస్యను ఎవరైనా ఎదుర్కొంటున్నారేమో తెలుసుకోవడానికి ఓ కార్యక్రమం ప్రారంభించారు. కంటి ఆరోగ్య ప్రాధాన్యతను ఆమె.. పెద్దలకు వివరించారు. కనుచూపు మంచిగా ఉంచుకోవడానికి అవసరమైన ఎక్సర్‌సైజులు, ఆహారాన్ని ఆమె చెప్పారు. పిల్లలకు మంచి కంటి చూపు ఉంచడం తన లక్ష్యం అని సుహా జుబేర్ చెబుతారు.
పిల్లల కోసం పాటుపడుతున్న సుహాకు చాలా అవార్డులు దక్కాయి. డైమాండ్ చాలెంజ్‌లో ఆమెకు గోర్ ఇన్నోవేషన్ అవార్డ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ సోషల్ ఇన్నోవేషన్ వరించింది. 2019లో ఆదిశంకర యంగ్ సైంటిస్ట్ అవార్డు కూడా ఆమెకు దక్కింది.