
హైదరాబాద్: తెలంగాణలో బిజెపిలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవలే ఉామ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ బిజెపిలో చేరారు. తాజాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు చెందిన ఓ మాజీ మంత్రి బిజెపిలో చేరేందుకు సిద్దంగా వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో సదరు మంత్రి బిజెపిలో చేరికపై చర్చలు కూడా జరిపినట్లు... అంతా సవ్యంగా జరిగితే ఆయన అతి త్వరలోనే కాషాయ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
పూర్వ హిమాయత్ నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మంత్రిగా చేసిన కృష్ణా యాదవ్ ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. గతంలో టిడిపి నగర అధ్యక్షులుగా పనిచేసిన ఆయన 2016లో ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అయితే టీఆర్ఎస్ లో తనకు అనుకున్న అవకాశాలు రాలేవని అసంతృప్తితో వున్న కృష్ణా యాదవ్ బిజెపిలో చేరేందుకు సిద్దపడినట్లు తెలుస్తోంది.
కృష్ణా యాదవ్ అంబర్ పేట నియోజవకర్గం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్ లో ఆ అవకాశం లేకపోవడం కూడా ఆయన పార్టీ మారడానికి కారణంగా తెలుస్తోంది. అంబర్ పేట నుండి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుండి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన కేంద్ర రాజకీయాల్లోనే కొనసాగాలని భావిస్తే తిరిగి ఎంపీగానే పోటీచేయనున్నారు. ఈ క్రమంలో అంబర్ పేట నుండి బిజెపి కొత్త అభ్యర్థిని బరిలోకి దింపుతుంది. ఇదే జరుగుతుందని భావించి కృష్ణా యాదవ్ బిజెపిలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బిజెపిలో చేరడానికి సిద్దంగా వున్న కృష్ణా యాదవ్...ఇందుకోసమే ఈటల రాజేందర్ తో భేటీ అయి పార్టీలో చేరికపై చర్చించినట్లు సమాచారం. అంబర్ పేట నుండి ఫోటీచేసే అవకాశం కల్పిస్తామని అదిష్టానం హామీ ఇస్తే ఇప్పటికిప్పుడు కాషాయ కండువా కప్పుకోడానికి సిద్దమని ఈటలతో కృష్ణా యాదవ్ అన్నట్లు సమాచారం.
నకిలీ స్టాంపుల కుంభకోణంలో కృష్ణ యాదవ్ హస్తముందని ఆరోపణలున్నాయి. ఈ కేసులో 2003లో అరెస్టయిన ఆయన మూడున్నరేళ్లు జైలు శిక్ష కూడా అనుభవించారు. ఇటీవలే ఈ స్టాంప్ కుంభకోణం నుండి బయటపడటంతో బిజెపిలో చేరి మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని కృష్ణా యాదవ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే ఇటీవలే టీఆర్‌ఎస్ నేత, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర బిజెపి నాయకుల సమక్షంలో భిక్షమయ్య గౌడ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్‌చుగ్... భిక్షమయ్య గౌడ్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ఇతర నేతలు పాల్గొన్నారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. ఇతర పార్టీ నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో సీనియర్ నేతలు, పార్టీ నాయకత్వాలపై అసంతృప్తితో ఉన్న నేతలతో మంతనాలు జరుపుతోంది. ఈ క్రమంలోనే బిక్షమయ్య గౌడ్ ను పార్టీలో చేర్చుకున్న బిజెపి ఇప్పుడు కృష్ణా యాదవ్ ను చేర్చుకోడానికి ప్రయత్నిస్తోంది.