
Telangana : పెరుగుతున్న నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా, రైతుల నుంచి వరిధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నిరసనల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎత్తిచూపనున్నారు. ఈ నెల 12 రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున్న ధర్నాలు నిర్వహించనున్నామని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నిరసనల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణలు, ప్రజలను భాగస్వామ్యం చేయనున్నట్టు సమాచారం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఖండిస్తూ... రాష్ట్రవ్యాప్త నిరసనలు, ధర్నాలకు దిగే అంశంపై టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్ రెడ్డి ఇవాళ ఆ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఇదివరకే దీని గురించి చర్చించారనీ, మరోసారి ఎలా ముందుకు సాగాలనే విషయంపై సమావేశం కానున్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్ 12న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి రాష్ట్రంలో రైతులు, ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందించాలని నిర్ణయించారు. అలాగే, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తూ.. రైతులు ఆగం పట్టిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని గ్రామస్థాయిలో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయడం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రాధాన్యతగా పెట్టుకున్నారు. దీనిలో భాగంగా ఏఫ్రిల్ 15 నుంచి 20 వరకు గ్రామాల్లో పర్యటించి రైతులతో చర్చించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల చివరి వారంలో రెండు రోజుల పాటు రాష్ట్ర పర్యటనకు రానున్న పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ సమావేశం నిర్ణయించింది.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టాలనీ, అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా ప్రజల్లోకి వెళ్లడానికి ముందస్తు ప్రాణాళికలతో ముందుకు సాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతూ.. దూకుడుగా ముందుకు సాగుతోంది కాంగ్రెస్. ఇక ఈ నెల చివర్లో రాష్ట్ర పర్యటనకు రాహుల్ గాంధీ రావడం.. భారీ బహిరంగ సభతో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపనుందనటంలో సందేహం లేదు. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. గవర్నర్ వ్యవస్థను గౌరవిస్తూ పాటించాల్సిన సంప్రదాయాలను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిదన్నారు. వ్యక్తులతో సంబంధాలు లేకుండా వ్యవస్థలను, సంప్రదాయాలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై తమ పార్టీ ముందుంటుందన్నారు. గవర్నర్ తల్లి చనిపోయిన సమయంలో గవర్నర్ ను సీఎం KCR పరామర్శించకపోవడం సరైంది కాదన్నారు.
ఇదిలావుండగా, ఈ నెల 11 అధికార టీఆర్ఎస్ పార్టీ దేశరాజధాని ఢిల్లీలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించడానికి సిద్ధమైంది. వరికొనుగోలు విషయంలో కేంద్రం తీరును ఖండిస్తూ.. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఈ ఆందోళనలు నిర్వహిస్తోంది టీఆర్ఎస్.