వాహనదారులకు అలర్ట్.. అలాంటి వారిపై చార్జిషీట్ దాఖలు చేయనున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..

By Sumanth KanukulaFirst Published May 22, 2022, 3:47 PM IST
Highlights

హైదరాబాద్‌ను శబ్ద కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు వారి వంతు చర్యలు చేపట్టారు. నిషేధిత ఎయిర్ హారన్లు, ప్రెషర్ హారన్లు, మల్టీ-టోన్ హారన్లు వినియోగించే వారిపై రూ.1000 జరిమానాతోపాటు కేసు నమోదు చేయనున్నారు.

హైదరాబాద్‌ను శబ్ద కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు వారి వంతు చర్యలు చేపట్టారు. నిషేధిత ఎయిర్ హారన్లు, ప్రెషర్ హారన్లు, మల్టీ-టోన్ హారన్లు వినియోగించే వారిపై రూ.1000 జరిమానాతోపాటు కేసు నమోదు చేయనున్నారు. మే 10వ తేదీ నుంచి నగరంలో నిషేధిత హారన్ల వల్ల ఏర్పడే శబ్ద కాలుష్యంపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నిషేధిత మల్టీ టోన్‌ హారన్‌లు, ఎయిర్‌ హారన్‌లు వాడినందుకు 3,320 మంది వాహనదారులపై హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి రూ. 1,000 జరిమానా విధించారు. నిషేధిత హారన్లను తొలగించారు.

జూన్ 1 నుంచి ఇలాంటి హారన్లు వినియోగించే డ్రైవర్లు, వాహన యజమానులపై చార్జ్ షీట్లు కూడా దాఖలు చేయబడతాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అలాంటి వాహనాల యజమానులపై కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేస్తామని జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. జూన్ నుంచి వారు ప్రాసిక్యూషన్‌ను కూడా ఎదుర్కొంటారని చెప్పారు. సెంట్రల్ మోటర్ వెహికల్స్ రూల్స్- 1989 ప్రకారం.. ఏ మోటారు వాహనంలో ఏదైనా మల్టీ టోన్ హార్న్ ఇవ్వడం, వివిధ నోట్స్ లేదా ఇతర శబ్దాలను ఉత్పత్తి చేసే పరికరంతో అధిక శబ్దాలు, ఒళ్లు జలదరించే హారన్లు అమర్చకూడదని ఆయన చెప్పారు.


‘‘వాహన కంపెనీ తయారు చేసిన హారన్‌ కాకుండా ఇతర హారన్లు ఉపయోగించరాదు. Central Motor Vehicles Rules- 1989 రూల్ 119 ప్రకారం.. ప్రతి మోటారు వాహనానికి ఎలక్ట్రిక్ హారన్‌ను మాత్రమే అమర్చాలని సూచించింది. ఇండియన్ మోటార్ వెహికల్స్ యాక్ట్, 1988లోని సెక్షన్ 52.. మోటారు వాహనాలలో మొదట తయారీదారు పేర్కొన్న హారన్‌లో మార్పు చేయడాన్ని నిషేధిస్తుంది. శబ్ద కాలుష్యానికి సంబంధించి నిర్దేశించిన ప్రమాణాలను ఉల్లంఘించిన వారు MV చట్టం, 1988లోని 190(2) సెక్షన్ కింద ప్రకారం శిక్షించబడతారు’’ అని రంగనాథ్ తెలిపారు. 

తెలంగాణ హైకోర్టు 2022 ఫిబ్రవరిలో..  నిషేధించబడిన మల్టీ టోన్ హారన్లు, సైరన్స్, హుటర్స్ తొలగించాలని, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించిందని రంగనాథ్ తెలిపారు. ట్రాఫిక్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ను కొనసాగిస్తూ నిబంధనలు ఉల్లంఘించినవారిపై కేసులు నమోదు చేస్తారని చెప్పారు.

click me!