
స్కిప్పింగ్ తాడు మెడకు బిగుసుకొని ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. సరదాగా ఆడుకునే అతని ప్రాణం తీస్తుందని ఊహించని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... కే.లోకేష్(11) అనే బాలుడు తన మేనమామ ఇంట్లో ఉంటున్నాడు. 2011లో బాలుడి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అప్పటి నుంచి బాలుడి పోషణ మేనమామ చూసుకుంటున్నాడు. లోకేష్ స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు.
సోమవారం రాత్రి బాలుడి మేనమామ ప్రభాకర్ పని మీద బయటకు వెళ్లాడు. అతని భార్య బాల్కనీలో దుస్తులు ఉతుకుతోంది. కాగా.. ఆ సమయంలో లోకేష్ కిచెన్ లో స్కిప్పింగ్ తాడుతో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో.. తాడు.. కిచెన్ లో పైన ఉన్న హుక్కుకి పట్టింది. మరోవైపు మెడకు చుట్టుకుంది.
దానిని తీసేందుకు బాలుడు ప్రయత్నింస్తుండగా.. తాడు మరింతగా బిసుకుంది. తర్వాత హుక్కు నుంచి తాడు తెగడంతో.. బాలుడు కింద ఫ్లోర్ మీద పడి తలకు గాయమైంది. పని ముగించుకొని లోపలికి వచ్చిన ప్రభాకర్ భార్యకి లోకేష్ స్పృహ లేకుండా పడి కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా... అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.