
IMD issues red alert: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మంగళవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department - IMD) పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వివరాల్లోకెళ్తే.. భారత వాతావరణ శాఖ ( ఐఎండీ ) శనివారం హైదరాబాద్ ప్రాంతంలో ఆగస్టు 7 (ఆదివారం) నాడు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. సోమ, మంగళవారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. ఐఎండీ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. "ఆగస్టు 8, 9 తేదీలలో తెలంగాణలోని ఈశాన్య, ఉత్తరం, పరిసర జిల్లాల్లో 75% నుండి 100% వరకు చాలా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది" అని ఐఎండీ హెచ్చరించింది. వారంలో చాలా రోజులలో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) అంచనా ప్రకారం మొత్తం వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా. ఈ క్రమంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
కాగా, వచ్చే వారం హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మొత్తంమీద, రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల సెల్సియస్ నుండి 34 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల సెల్సియస్ నుండి 24 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండనుంది. శుక్రవారం అత్యధికంగా హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో 4.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా జగిత్యాల జిల్లా బుగ్గారంలో అత్యధికంగా 91.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, పలు చోట్ల మోస్తారుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో చెరువులు, నదుల్లోకి భారీ వర్షపు నీరు చేరుతోంది. ముంపునకు గురయ్యే పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
భారత వాతావరణ శాఖ (IMD) ఆగస్టు 8న తెలంగాణలోని 11 జిల్లాల్లో రెడ్ వార్నింగ్ జారీ చేసింది. ఏకాంత ప్రదేశాలలో చాలా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లె, ములుగు, ఖమ్మం తదితర 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. జూలైలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిసి చివరకు గోదావరిలో వరదలు సంభవించిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్) జిల్లాలకు ఆగస్టు 8న ఆరెంజ్ వార్నింగ్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆగస్టు 9న రెడ్ వార్నింగ్ జారీ చేశారు. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబదాద్, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్), జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆగస్టు 6న ఆరెంజ్ వార్నింగ్ జారీ చేశారు.