తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 24 గంటల వ్యవధిలో రూ. 4 కోట్లను పోలీసులు సీజ్ చేశారు. ఐదు కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గత 24 గంటల వ్యవధిలో హైద్రాబాద్ నగర పరిధిలో ఐదు కేసులు నమోదయ్యాయి. రూ. 4 కోట్లను పోలీసులు సీజ్ చేశారు. హవాలా మార్గంలో డబ్బులు సరఫరా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అవసరమైన నగదును పార్టీలు తరలిస్తున్నాయి.
మద్యం, నగదు, బంగారం తరలింపై పోలీసులు నిఘాను పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఎక్కడికక్కడే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఈ నెల 9వ తేదీ నుండే హైద్రాబాద్ నగరంలో తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేపట్టిన 24 గంటల్లోనే హవాలా మార్గంలో డబ్బులు తరలిస్తున్న రూ. 4 కోట్లను పోలీసులు సీజ్ చేశారు. అక్రమంగా కోటి రూపాయాల నగదును తరలిస్తే రూ. 25 వేలను కమీషన్ గా తీసుకుంటున్నారని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.
undefined
హైద్రాబాద్ లో నిన్న రాత్రి బంజారాహిల్స్ లో రూ. 3 కోట్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ నెల 9న నిజాం కాలేజీ వద్ద ఏడు కిలోల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. అంతేకాదు 300 కిలోల వెండిని కూడ సీజ్ చేశారు. అత్తాపూర్ లో రూ. 14 లక్షల నగదును సీజ్ చేశారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో సరైన రశీదులు లేకుండా నగదును తరలిస్తే ఇబ్బందులు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. రూ. 50 వేల కంటే ఎక్కువ నగదును తరలించాల్సిన పరిస్థితులు వస్తే సంబంధించిన రశీదులను తమ వెంట తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. సీజ్ చేసిన నగదుకు సంబంధించిన పత్రాలను అధికారులకు చూపితే ఆ నగదును తిరిగి పొందే అవకాశం ఉంది. లెక్క చూపని నగదుతో పట్టుబడితే జీఎస్‌టీ, ఐటీ అధికారులు కూడ రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదు.
also read:తెలంగాణలో ఎన్నికల కోడ్: పోలీసుల తనిఖీలు, హైద్రాబాద్‌లో ఏడు కిలోల బంగారం సీజ్
గతంలో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో కూడ హైద్రాబాద్ నగరంలో భారీగా నగదును పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఈసీ ప్రకటించింది. దీంతో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.