ఈసారి హైదరాబాద్ పోలీసులు పతంగులు ఎగురవేయడంపై నిషేధాజ్ఞలు జారీ చేశారు. ప్రార్ధనా స్థలాలు, వాటి పరిసరాల్లో గాలిపటాలు ఎగురవేయరాదని ఆదేశించారు. ఈ ఉత్తర్వులు జనవరి 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి జనవరి 16వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో వుంటాయని చెప్పారు.
మకర సంక్రాంతిని పురస్కరించుకుని గాలి పటాలు ఎగురవేయడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీ కింద వస్తోంది. పండుగకు కొద్దిరోజుల ముందు నుంచే పతంగుల తయారీ, ఎగురవేయడానికి కావాల్సిన దారాన్ని సేకరించడం వంటి పనుల్లో చిన్నా ,పెద్దా నిమగ్నులై వుంటారు. హైదరాబాద్‌లో అయితే ప్రత్యేకంగా కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు . కానీ ఈసారి మాత్రం పోలీసులు పతంగులు ఎగురవేయడంపై నిషేధాజ్ఞలు జారీ చేశారు. ప్రార్ధనా స్థలాలు, వాటి పరిసరాల్లో గాలిపటాలు ఎగురవేయరాదని ఆదేశించారు.
ప్రజల భద్రతను దృష్టిలో వుంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ కే. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ ఉత్తర్వులు జనవరి 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి జనవరి 16వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో వుంటాయని చెప్పారు. ముందస్తు అనుమతి లేకుండా ప్రార్థనా స్థలాలు, బహిరంగ ప్రదేశాల చుట్టూ లౌడ్ స్పీకర్ , డీజే వంటివి ఏర్పాటు చేయరాదని పేర్కొన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో రాత్రి పది గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య సంగీతాన్ని ప్లే చేయడం కూడా అనుమతించబడదని పోలీసులు వెల్లడించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండదా వుండేందుకు బాల్కనీలు, డాబాలపై గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను పర్యవేక్షించాలని ఆయన కోరారు.
మరోవైపు.. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌కు హైదరాబాద్ మరోసారి ముస్తాబైంది. ఈ నెల 13 నుంచి 3 రోజుల పాటు పరేడ్ గ్రౌండ్స్‌లో పతంగుల పండుగ జరగనుంది. ఇందులో 16 దేశాలకు చెందిన 40 మంది.. భారత్‌కు చెందిన 60 మంది పాలుపంచుకుంటారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ ఫెస్టివల్ కోసం భారీ ఏర్పాట్లు చేసింది. కైట్ ఫెస్టివల్‌తో పాటే స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్వీట్స్‌ను అందుబాటులో వుంచుతారు. అలాగే హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాళ్లను ఏర్పాటు చేస్తారు.