
తనను పట్టుకోవాలంటూ హైదరాబాద్ పోలీసులకు (hyderabad police) సవాల్ విసిరిన లగ్జరీ కార్ల దొంగ సత్యేంద్ర సింగ్ షెకావత్‌ను (satyendra singh shekawat) పట్టుకున్నారు. బెంగళూరులో శనివారం ఇతనిని అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా లగ్జరీ కార్లు చోరీ చేసి పోలీసులకు సవాల్ విసురుతున్నాడు షెకావత్. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో లగ్జరీ కారును చోరీ చేశాడు షెకావత్. ఈ క్రమంలో కొన్ని క్లూస్ ఇచ్చి తనను పట్టుకోవాలంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ నగరానికి చెందిన ఆర్మీ జవాన్ కుమారుడే సత్యేంద్ర. 2003 నుంచి కార్ల దొంగగా మారాడు షెకావత్. ఇప్పటి వరకు అతనిపై పది రాష్ట్రాల్లో 61 కార్ల చోరీ కేసులు వున్నాయి. ఆరు నెలల క్రితమే హైదరాబాద్ నాచారంలో మరో కారును చోరీ చేశాడు షెకావత్.
మహారాష్ట్రలోని నాసిక్ పంచవటి పోలీస్ స్టేషన్ పరిధిలో 2003లో క్వాలిస్ చోరీ చేయడంతో మొదలైన సత్యేంద్ర సింగ్ నేరచరిత్ర ప్రస్తుతం ఆడి, బీఎండబ్ల్యూ, స్కార్పియో వంటి అత్యంత ఖరీదైన కార్లను మాత్రమే చోరీ చేసేదాకా వచ్చింది. చోరీ చేసిన కార్లను విక్రయించగా వచ్చే సొమ్ముతో అతను జల్సాలు చేస్తాడు. ఖరీదైన కార్లను టార్గెట్ చేసుకొని వాటిని చోరీ చేయడంలో సత్యేంద్ర సింగ్ నిష్ణాతుడు. కారు తాళాలు స్కాన్ చేయడానికి, వాహనం నెంబరు ఇతర వివరాలు, జీపీఎస్ ద్వారా దాని ఉనికిని కనిపెడతాడు. దానికి డూప్లికేట్ కీ తయారు చేసుకోవడానికి అవసరమైన పనిముట్లను చైనా నుండి తెప్పించుకున్నాడు.
ఇంజన్ నెంబర్, చాసిస్ నెంబర్ ఆధారంగా కారుకి నకిలీ తాళం తయారు చేయడంలో షెకావత్‌కి ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లోకి వస్తున్న సెన్సార్ వాహనాలను కూడా అతను చాకచక్యంగా కొట్టేస్తున్నాడు. వీటిని చోరీ చేయడం కోసం చైనా నుంచి ఎక్స్ టూల్ ఎక్స్ 100 ప్యాడ్ అనే పరికరాన్ని తెప్పించాడు. ఇటీవల వీడియో కాల్ చేసి తనను దమ్ముంటే పట్టుకోవాలంటూ పోలీసులకే సవాల్ విసిరాడు సత్యేంద్ర. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు బెంగళూరులో అతని ఆచూకీ కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారు.