
Eliminating Malaria: మలేరియా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. తెలంగాణలో మలేరియా కేసులు గత ఆరేండ్లలో (2015-2021మధ్య) గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రశంసించాయి. మలేరియా నిర్మూలనకు తెలంగాణ చేస్తున్న కృషికి గానూ ఇప్పటివరకు క్యాటగిరీ-2 లో ఉన్న రాష్ట్రం కాటగిరీ-1లో చేరిందని ప్రకటించాయి. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణను కేంద్రం సత్కరించనున్నది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖకు దీనికి సంబంధించిన సమాచారం కూడా ఆందిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఎన్‌విబిడిసిపి) నేషనల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ ఇన్ ఇండియా (ఎన్‌ఎఫ్‌ఎంఇఐ) చొరవలో భాగంగా 2015-2021 మధ్య గత ఆరేండ్లలో మలేరియా నిర్మూలనకు తెలంగాణ రాష్ట్రం చేసిన కృషికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS), ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MOHFW) ల ప్రశంసలు లభించాయి.
మలేరియా నిర్మూలనలో కేటగిరీ-2 వర్గీకరణను కలిగి ఉన్న తెలంగాణను ఇప్పుడు అప్‌గ్రేడ్ చేసి కేటగిరీ-1గా వర్గీకరించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్) MOHFW తెలిపారు. ఇదే విషయాన్ని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా వెళ్లడించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో చేపట్టిన గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి కార్యక్రమాల వల్ల పారిశుధ్యం పెరిగి మలేరియా తగ్గుముఖం పట్టిందని మంత్రి హరీశ్‌రావు శనివారం ట్వీట్ చేశారు. అదే స్ఫూర్తితో త్వరలో తెలంగాణను మలేరియా రహిత రాష్ట్రంగా (జీరో కేటగిరీ) మార్చేందుకు కృషి చేస్తామన్నారు. దీని కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. "ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేంద్రం ఆహ్వానం పంపింది" అని మంత్రి చెప్పారు.
కేటగిరీ-2 రాష్ట్రాలు మలేరియా పూర్వ నిర్మూలన దశలో ఉన్న రాష్ట్రాలు.. వార్షిక పరాన్నజీవి సంభవం (API)తో 1000 జనాభాకు 1 కేసు కంటే తక్కువ ప్రమాదం ఉంది. అయితే ఆయా జిల్లాల్లో కొన్ని ప్రమాదంలో ఉన్న 1000 జనాభాకు 1 కేసుకు పైగా API ని నివేదిస్తున్నాయి. కేటగిరీ-1 అనేది మలేరియా నిర్మూలన దశకు చేరుకున్న రాష్ట్రాలు, వాటి జిల్లాలతో సహా ప్రమాదంలో ఉన్న 1000 జనాభాకు 1 కేసు కంటే తక్కువ APIని నివేదించింది. తెలంగాణతో పాటు దేశంలోని మరో పది రాష్ట్రాలు కూడా కేటగిరీ-1 లోకి ప్రవేశించాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్, బీహార్, నాగాలాండ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, గుజరాత్, కర్నాటక, ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి. తెలంగాణలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గినట్టు ఇటీవల విడుదల చేసిన ‘నేషనల్ హెల్త్ ప్రొఫైల్-2021’లో కేంద్ర వైద్యారోగ్య శాఖ పేర్కొన్నది. ఈ నివేదిక ప్రకారం 2016లో రాష్ట్రంలో 3,512 మలేరియా కేసులు నమోదవగా.. 2020 నాటికి ఆ సంఖ్య 870కి తగ్గాయి.