సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో ఆరుగురు మృతికి కారణమైన ముగ్గురు క్యూనెట్ సంస్థ ప్రతినిధులను అరెస్ట్ చేశారు పోలీసులు.
హైదరాబాద్: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో ఆరుగురు మృతికి కారణమైన క్యూనెట్ సంస్థకు చెందిన ముగ్గురిని మంగళవారంనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది మార్చి 16వ తేదీ రాత్రి స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ లోని 7,8 అంతస్తుల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో క్యూనెట్ సంస్థలో పనిచేసే ఆరుగురు మృతి చెందారు.
మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో క్యూనెట్ సంస్థ కార్యకలాపాలు చేపట్టింది. ఈ సంస్థలో పెట్టుబడులు పెడితే ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు ఆశలు కల్పించిందనే ఆరోపణలున్నాయి. ఈ ప్రచారం ఆధారంగా నిరుద్యోగులు కొందరు క్యూనెట్ సంస్థలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు పొందారని ప్రచారం సాగుతుంది. ఈ విషయమై విచారణ నిర్వహించి క్యూనెట్ కు చెందిన ముగ్గురిని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు.